Goutham Sawang: ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌సవాంగ్‌ రాజీనామాకు గవర్నర్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌ పదవికి గౌతమ్‌ సవాంగ్‌ రాజీనామా చేశారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు బుధవారం తన రాజీనామా లేఖను అందజేయగా ఆయన దానిని ఆమోదించారు.

Published : 04 Jul 2024 10:13 IST

ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదించారు. వైకాపా ప్రభుత్వంలో డీజీపీగా ఉన్నప్పుడు గౌతమ్‌ సవాంగ్‌ వ్యవహారశైలి పలుమార్లు విమర్శల పాలైంది. ఆయన హయాంలో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలతో పాటు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపైనా కేసులు పెట్టారు. అదే సమయంలో 2022 ఫిబ్రవరిలో విజయవాడలో ఉద్యోగులు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైకాపా ప్రభుత్వం అదే నెల మూడో వారంలో డీజీపీ హోదా నుంచి సవాంగ్‌ను తప్పించి ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించింది. 2025 జులై 9 వరకు ఈ పదవిలో గౌతమ్‌ సవాంగ్‌ కొనసాగాల్సి ఉంది. ఆయన హయాంలోనే 2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబుపత్రాల మూల్యాంకనం రెండోసారి జరిగిందన్న దానిపై పెద్ద దుమారం రేగింది. దీనిపై న్యాయస్థానంలో ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. గౌతమ్‌ సవాంగ్‌ కమిషన్‌లో ఏకపక్షంగా వ్యవహరించారన్న విమర్శలూ ఉన్నాయి.

Tags :

మరిన్ని