Julian Assange: నేరాంగీకారానికి అసాంజే సిద్ధం

గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటూ ఇన్నాళ్లూ బ్రిటన్‌లో తలదాచుకున్న వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే నేరాంగీకారానికి సిద్ధమయ్యారు.

Published : 26 Jun 2024 05:56 IST

అమెరికాతో వికీలీక్స్‌ వ్యవస్థాపకుడి ఒప్పందం 

బ్యాంకాక్, వాషింగ్టన్‌: గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటూ ఇన్నాళ్లూ బ్రిటన్‌లో తలదాచుకున్న వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే నేరాంగీకారానికి సిద్ధమయ్యారు. అమెరికా న్యాయ విభాగంతో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన ఆ దేశానికి చెందిన ఉత్తర మారియానా ద్వీపానికి మంగళవారం పయనమయ్యారు. ఆయన వెంట భార్య స్టెల్లా ఉన్నారు. అంతకుముందు ఒప్పందం మేరకు ఆయన బ్రిటన్‌లోని జైలు నుంచి విడుదలయ్యారు. అక్కడి నుంచి బయలుదేరి మంగళవారం రాత్రి బ్యాంకాక్‌కు చేరుకున్నారు. అక్కడ ఇంధనం నింపుకొన్న ప్రత్యేక విమానం ద్వీప రాజధాని అయిన సైపన్‌కు బయలుదేరింది. స్థానిక కాలమానం ప్రకారం సైపన్‌కు బుధవారం ఉదయం 6 గంటలకు విమానం చేరుకోనుంది. 

పశ్చిమ పసిఫిక్‌లో ఉన్న ఉత్తర మారియానా ద్వీపంలోని ఫెడరల్‌ కోర్టులో అసాంజే హాజరు కానున్నారు. గూఢచర్యం చట్టానికి విరుద్ధంగా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందడం, వ్యాప్తి చేయడం వంటి నేరారోపణలను అసాంజే అంగీకరించనున్నారు. దీనిని న్యాయమూర్తి కచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుంది. అదే జరిగితే ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయ పోరాటానికి ఓ పరిష్కారం లభిస్తుంది. నేరాంగీకారం, శిక్ష ఖరారు తర్వాత అసాంజే ఆస్ట్రేలియాకు చేరుకోనున్నారు. సైపన్‌లో బుధవారం ఉదయం అసాంజే కోర్టులో హాజరుకానున్నారు. అమెరికాకు రావడానికి ఆయన నిరాకరించడంవల్లే విచారణను అక్కడ చేపడుతున్నారు. పైగా అమెరికా అధీనంలో ఉండే ఆ భూభాగం ఆస్ట్రేలియాకు సమీపంలో ఉంటుంది. తాజా ఒప్పందంలో భాగంగా అసాంజే నేరాన్ని అంగీకరిస్తారు. దీనికి ప్రతిగా అదనపు జైలు శిక్ష నుంచి ఆయనకు విముక్తి లభించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని