Rishi Sunak: రిషి సునాక్‌కు మళ్లీ విజయం దక్కేనా? బ్రిటన్‌లో మొదలైన ఓటింగ్‌

Rishi Sunak: బ్రిటన్‌లో పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. ఈ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్‌కు రెండోసారి విజయం దక్కుతుందా, లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.

Updated : 04 Jul 2024 18:30 IST

లండన్‌: బ్రిటన్‌లో సార్వత్రిక సమరం (UK Parliament Elections) మొదలైంది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7 గంటలకు పార్లమెంట్‌ ఎన్నికలకు ఓటింగ్‌ ప్రారంభమైంది. కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తొలి గంటలోనే ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak), ఆయన సతీమణి అక్షతా మూర్తి ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ, కెయిర్‌ స్టార్మర్‌ ఆధ్వర్యంలోని లేబర్‌ పార్టీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

ఇంగ్లాండ్‌తో పాటు స్కాట్లాండ్‌, వేల్స్‌, ఉత్తర ఐర్లాండ్‌లోని మొత్తం 650 నియోజకవర్గాల్లో ఓటింగ్‌ (voting in Britain) జరుగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలంటే 326 సీట్ల మెజార్టీ రావాలి. ప్రధాన పార్టీలతో పాటు లిబరల్‌ డెమొక్రాట్స్‌, గ్రీన్‌ పార్టీ, స్కాటిష్‌ నేషనల్‌ పార్టీ, ఎస్‌డీఎల్‌పీ, డెమొక్రాటిక్‌ యూనియనిస్ట్‌ తదితర ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. యూకే వ్యాప్తంగా దాదాపు 40వేల పోలింగ్‌ కేంద్రాల్లో జరుగుతున్న ఓటింగ్‌లో 4.6కోట్ల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే చాలామంది పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓటేశారు.

సందేహం అక్కర్లేదు.. నేనే అధ్యక్ష అభ్యర్థిని: బైడెన్‌

స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఓటింగ్‌ ముగుస్తుంది. ఆ వెంటనే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను ప్రకటిస్తారు. పోలింగ్‌ (UK Polling) ముగిసిన కాసేపటికే కౌంటింగ్‌ చేపట్టనున్నారు. యూకే కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి కంటే ముందే (భారత్‌లో శుక్రవారం తెల్లవారుజామున) తొలి ఫలితం వెలువడనుంది.

సునాక్‌ భవితవ్యం ఏంటీ..?

ఈ ఎన్నికల్లో సునాక్‌ (Rishi Sunak) నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీకి ఓటమి తప్పదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్లక్రితం ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా ఘనత సాధించారు. అయితే, ఇటీవల కాలంలో ఆయన పాపులారిటీ తగ్గుతూ వస్తోంది. వలసల కట్టడి, ఇతర అంశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వచ్చాయి. 

ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలోనూ పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణల్లో సునాక్, ఆయన కన్జర్వేటివ్‌ పార్టీ రేటింగ్‌లు పడిపోతూ వచ్చాయి. 14 ఏళ్ల తరవాత తొలిసారి కన్జర్వేటివ్‌ పార్టీ ఓడిపోతుందని సర్వేలు సూచిస్తున్నాయి. 1997 మాదిరిగా లేబర్‌ పార్టీకి ఈ ఎన్నికల్లో ఘన విజయం దక్కే అవకాశాలున్నట్లు అత్యధిక ఒపీనియన్‌ పోల్స్‌ అంచనా వేశాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని