హాథ్రస్‌ తొక్కిసలాట ఘటన.. రష్యా, జపాన్‌ అధినేతల సంతాపం

యూపీలోని హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై స్పందించిన రష్యా, జపాన్‌ అధినేతలు సంతాపం ప్రకటించారు. 

Published : 03 Jul 2024 22:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh)లోని హాథ్రస్‌ జిల్లాలో భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటన యావత్‌ దేశాన్ని పెను విషాదంలోకి నెట్టింది. ఈ ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉండడం బాధాకరం. ఈ దుర్ఘటనపై  రష్యా (Russia) , జపాన్ (Japan) విచారం వ్యక్తం చేశాయి.

‘‘ఈ విషాద ఘటనపై విచారణ వ్యక్తం చేస్తున్నాం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి’’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Vladimir Putin) పేర్కొన్నారు. ఆయన ప్రకటనను ఆ దేశ రాయబార కార్యాలయం ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా పోస్టు చేసింది. మరోవైపు.. హాథ్రస్‌ ఘటనపై జపాన్‌ ప్రధానమంత్రి ఫుమియో కిషిద (Fumio Kishida) విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. ‘‘తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని మా ప్రభుత్వం ప్రార్థిస్తుంది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి’’ అని పేర్కొన్నారు.

‘ఆమె’ కలలకు తాలిబన్ల సంకెళ్లు..!

కాగా.. భోలే బాబా పాద ధూళి కోసం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దురదృష్టవశాత్తూ తొక్కిసలాట జరగడంతో వందల మంది ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. 80 వేల మందికి మాత్రమే అనుమతి ఉన్న ఈ కార్యక్రమానికి 2 లక్షలకు పైగా హాజరైనట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఘటనపై విశ్రాంత హైకోర్టు జడ్జితో జ్యుడీషియల్‌ విచారణ జరుపుతామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనిపై ఏదైనా కుట్ర జరిగిందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తారని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని