US on Pak elections: పాక్‌ ఎన్నికలపై దర్యాప్తునకు అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం

US on Pak elections: పాకిస్థాన్ ఎన్నికల్లో అక్రమాలపై దర్యాప్తునకు డిమాండ్‌ చేస్తూ అమెరికా ప్రతినిధుల సభ తీర్మానించింది. దీన్ని పాక్‌ తప్పుబట్టింది.

Published : 27 Jun 2024 10:40 IST

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌లో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలపై (Pak Elections) సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేస్తూ అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం చేసింది. దీన్ని రెండు ప్రధాన పార్టీలు దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించాయి. పాక్‌లో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిరక్షణ, చట్టబద్ధ పాలనకు పిలుపునిస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

తీవ్ర ఆర్థిక సంక్షోభం, భద్రతా సవాళ్ల మధ్య జీవిస్తున్న పాక్‌ ప్రజల హక్కుల పరిరక్షణ చాలా కీలకమని తీర్మానం పేర్కొంది. నిష్పక్షపాత ఎన్నికలు, ప్రజాస్వామ్య పరిరక్షణలో అక్కడి ప్రజలకు అమెరికా అండగా ఉంటుందని తెలిపింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సామాన్యుల మెరుగైన భవిష్యత్తు కోసం అవినీతిని అరికడుతూ చట్టబద్ధమైన పాలనను అందించాల్సిన అవసరం ఉందని గుర్తుచేసింది. పాక్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియల్లో భాగస్వామ్యం కాకుండా ప్రజలను బెదిరించడం, హింసకు పాల్పడడం, నిర్బంధించడం, ఇంటర్నెట్‌పై ఆంక్షల వంటి చర్యలను తీర్మానం ద్వారా అమెరికా తీవ్రంగా ఖండించింది.

అమెరికా తీర్మానంపై పాక్‌ విదేశాంగ శాఖ స్పందించింది. తమ దేశ రాజకీయాలపై పూర్తిస్థాయి అవగాహన లేకుండా చేసిన చర్యగా అభివర్ణించింది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్న తరుణంలో ఇలాంటి తీర్మానం రావడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. రాజ్యాంగ విలువలు, మానవ హక్కులు, చట్టబద్ధ పాలనకు పాక్‌ కట్టుబడి ఉందని చెప్పుకొచ్చింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో పాక్‌ సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు జరిగినట్లు అక్కడి ప్రధాన రాజకీయ పార్టీలే ఆరోపించాయి. ఇంటర్నెట్‌పై ఆంక్షలు, రిగ్గింగ్‌, హింసాత్మక చర్యలు వంటి ఘటనలు నమోదయ్యాయి. నిర్బంధంలో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, ఆయన పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌.. ఎన్నికల ఫలితాలను వ్యతిరేకించాయి. ఆయన పార్టీ మద్దతుగా నిలిచిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. కానీ, నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్‌-నవాజ్‌, బిలావల్‌ భుట్టో జర్దారీ ఆధ్వర్యంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు