UN Security Council: నౌకలపై దాడులు ఆపండి

పశ్చిమాసియా సముద్ర జలాల్లో నౌకా రవాణాకు ఆటంకం కలిగించవద్దని, నౌకలపై దాడులు నిలిపివేయాలని హూతీ తిరుగుబాటుదారులను డిమాండ్‌ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గురువారం ఓ తీర్మానం ఆమోదించింది.

Published : 29 Jun 2024 05:16 IST

హూతీలను డిమాండ్‌ చేస్తూ ఐరాస భద్రతా మండలి తీర్మానం

దుబాయ్‌: పశ్చిమాసియా సముద్ర జలాల్లో నౌకా రవాణాకు ఆటంకం కలిగించవద్దని, నౌకలపై దాడులు నిలిపివేయాలని హూతీ తిరుగుబాటుదారులను డిమాండ్‌ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గురువారం ఓ తీర్మానం ఆమోదించింది. హూతీలు కొనసాగిస్తున్న క్షిపణి, డ్రోన్‌ దాడులను ఖండించింది. ఎర్ర సముద్రం, గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌లో జరుగుతున్న హూతీల దాడులపై ప్రతి నెలా నివేదికలను సమర్పించాల్సిన అవసరం ఉందని ఐరాస సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరెస్‌కు సూచిస్తూ భద్రతా మండలి మరో తీర్మానం చేసింది. ఈ రెండింటికీ 12 మంది సభ్యులు ఆమోదం తెలుపగా రష్యా, చైనా, అల్జీరియా దేశాల ప్రతినిధులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.  గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ యుద్ధం ఆరంభమైన తర్వాత యెమెన్‌కు చెందిన హూతీలు పశ్చిమాసియా సముద్ర జలాల్లో ప్రయాణించే నౌకలు లక్ష్యంగా దాడులు ప్రారంభించారు. దీంతో ఆసియా, పశ్చిమాసియా, ఐరోపా మార్కెట్లకు సరకు రవాణా గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పటి వరకు హూతీలు 60కు పైగా నౌకలపై క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించారు.  ఈ ఏడాది జనవరి 10న కూడా హూతీల దాడులను ఖండిస్తూ భద్రతామండలి ఇటువంటి తీర్మానమే చేసింది. నౌకలపై దాడులు నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఐరాస భద్రతామండలి తీర్మానం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న ఓ నౌక సమీపంలో అయిదు క్షిపణులు పేలాయి. అయితే, ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిసింది. యెమెన్‌లోని హొడేడా  నగర సమీప సముద్ర జలాల్లో ఈ ఘటన జరిగిందని బ్రిటన్‌ ఆర్మీకి చెందిన యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మ్యారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ వెెల్లడించింది. ఇది హూతీ తిరుగుబాటుదారుల పనేనని భావిస్తున్నప్పటికీ వారి నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని