Millionaires migration: సంపన్నుల స్వర్గధామం.. దుబాయ్‌ వైపే వారి చూపు!

4300 మంది భారతీయ మిలియనీర్లు ఈ ఏడాది విదేశాలకు వలస వెళ్లే అవకాశముందని తాజా నివేదిక అంచనా వేసింది.

Published : 19 Jun 2024 17:40 IST

దిల్లీ: భారత్‌ నుంచి ఏటా వేల సంఖ్యలో సంపన్నులు విదేశీ బాట పడుతున్న సంగతి తెలిసిందే. అయితే, గతేడాదితో పోలిస్తే ఈసారి భారత్‌ను వీడేవారి సంఖ్య కాస్త తక్కువగానే ఉండనున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. మొత్తంగా 4300 మంది మిలియనీర్లు ఈ ఏడాది విదేశాలకు వలస వెళ్లే అవకాశముందని అంచనా వేసింది. అయితే, వీరిలో ఎక్కువమంది గమ్యస్థానం మాత్రం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఉండటం గమనార్హం.

ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు, సంపన్నుల కదలికల తీరును హెన్లీ అండ్‌ పార్ట్నర్స్‌ సంస్థ విశ్లేషిస్తుంటుంది. తాజాగా విడుదల చేసిన ‘హెన్లీ ప్రైవేట్‌ వెల్త్‌ మైగ్రేషన్‌ నివేదిక-2024’ ప్రకారం.. గతేడాది 5100 మంది అత్యధిక ఆదాయం కలిగిన వ్యక్తులు దేశాన్ని వీడినట్లు తెలిసింది. ఈసారి ఆ సంఖ్య నాలుగువేల పైచిలుకు ఉండవచ్చని అంచనా వేసింది. అంతర్జాతీయ భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి, సామాజిక తిరుగుబాట్ల వంటి ప్రభావం ఈసారి కనిపిస్తోందని తాజా నివేదిక అభిప్రాయపడింది.

సంపన్నుల స్వర్గధామంగా..

2024లో వేల మంది సంపన్నులను యూఏఈ ఆకర్షించనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. జీరో ఇన్‌కమ్‌టాక్స్‌ పాలసీ, గోల్డెన్‌ వీసా ప్రోగ్రామ్‌, లగ్జరీ లైఫ్‌స్టైల్‌.. ఇలా సకల సౌకర్యాలు కలిగిన ప్రదేశం కావడంతో మిలియనీర్లకు ఈ ప్రాంతం స్వర్గధామంగా ఉంటోంది. అయితే, ఇలా వచ్చే వారికి పూర్తి సంరక్షణ కలిగించేందుకు అక్కడి ప్రభుత్వం కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. యూఏఈతోపాటు అమెరికా, సింగపూర్‌, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు సంపన్నులను ఆకర్షించే దేశాల జాబితాలో ఉన్నాయి.

ఆ ఐపీఓలో రూ.10వేలు పెట్టి ఉంటే.. ఇప్పుడు కోటీశ్వరులే!

ఇలా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం కలిగిన వ్యక్తుల (HNWI) వలసలు భారీ స్థాయిలో ఉంటున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది. గతేడాది ఈ సంఖ్య 1.25లక్షలుగా ఉండగా.. 2024లో మొత్తంగా 1,28,000 మంది వలసబాట పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదిలాఉంటే, 10లక్షల డాలర్లు అంతకంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టే మిలియనీర్లు వారిని అత్యధిక సంపద కలిగిన వ్యక్తులుగా (HNWI) హెన్లీ అండ్‌ పార్ట్నర్స్‌ పరిగణిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని