Russia Ukraine war: ఒక్క రోజులో యుద్ధం ఆపేస్తానన్న ట్రంప్‌.. సాధ్యం కాదన్న రష్యా!

Russia Ukraine war: రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధాన్ని తాను 24 గంటల్లో ఆపేస్తానని అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెబుతున్నారు. రష్యా మాత్రం ఇది అంత త్వరగా పరిష్కరించగల సమస్య కాదని పేర్కొంది.

Published : 02 Jul 2024 08:48 IST

Russia Ukraine war | ఐరాస: తాను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధాన్ని (Russia Ukraine war) ఒక్కరోజులో ఆపేస్తానని డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఈ విషయాన్ని ఆయన ఇటీవల తన ప్రచార కార్యక్రమాల్లో పదే పదే చెబుతున్నారు. రష్యా మాత్రం అది సాధ్యం కాదని వాదిస్తోంది. ఉక్రెయిన్‌ సంక్షోభం ఒక్కరోజులో పరిష్కరించదగిన అంశం కాదని తెలిపింది.

యుద్ధంలో రష్యన్లు, ఉక్రెయిన్లు వేలాది మంది మరణిస్తున్నారని 2023 మేలో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్‌ (Donald Trump) తొలిసారి అన్నారు. తనకు అవకాశం లభిస్తే ఈ మారణహోమాన్ని ఆపేస్తానన్నారు. కేవలం 24 గంటల్లో నిలువరించే సామర్థ్యం తనకు ఉందని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని ఆయన తాజా ప్రచార కార్యక్రమాల్లో పదే పదే వల్లెవేస్తున్నారు. గతవారం అధ్యక్షుడు బైడెన్‌తో జరిగిన చర్చలోనూ దీని ప్రస్తావన వచ్చింది. అమెరికాలో గనక బలమైన అధ్యక్షుడు, పుతిన్‌ గౌరవం పొందగలిగే వ్యక్తి ఉండి ఉంటే అసలు ఉక్రెయిన్‌పై యుద్ధం జరిగేదే కాదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం కావటంతో ట్రంప్‌ (Trump) వ్యాఖ్యలపై ఐరాసలోని రష్యా రాయబారి వాసిలీ నెబెంజా తాజాగా స్పందించారు.

సుప్రీంకోర్టులో ట్రంప్‌నకు ఉపశమనం

ఏప్రిల్‌ 2022లో ఇస్తాంబుల్‌లో రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఒప్పందం దాదాపు ఖరారు దశకు చేరిందని నెబెంజా వెల్లడించారు. అది సఫలీకృతమైతే యుద్ధం అప్పుడే ముగిసి ఉండేదని తెలిపారు. కానీ, ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్న పాశ్చాత్య దేశాలే ఆ ఒప్పందాన్ని చెడగొట్టాయని ఆరోపించారు. రష్యాతో పోరాటం కొనసాగించాలని కీవ్‌ను ఎగదోశారని పేర్కొన్నారు. అవన్నీ మర్చి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇప్పుడు ‘శాంతి ఒప్పందం’ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.

పుతిన్‌ ప్రతిపాదించినట్లుగా ఉక్రెయిన్‌ వెంటనే కాల్పుల విరమణకు ముందుకు రావాలని నెబెంజా అన్నారు. 2022లో రష్యా ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఆ దేశ బలగాలను ఉపసంహరించుకోవాలని సూచించారు. పాశ్యాత్య దేశాల సైనిక కూటమి నాటోలో చేరబోమని హామీ ఇవ్వాలని తెలిపారు. అప్పుడే యుద్ధం ముగింపు దిశగా బాటలు పడతాయని అభిప్రాయపడ్డారు. పుతిన్‌ ప్రతిపాదనను జెలెన్‌స్కీ తిరస్కరించిన విషయం తెలిసిందే. తమ భూభాగాన్ని పూర్తిగా అప్పగించాల్సిందేనని పట్టుబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని