Trump-Biden Debate: నువ్వు అబద్ధాలకోరువి.. కాదు నువ్వే

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. నువ్వు అబద్ధాలకోరువంటే.. నువ్వే అబద్ధాలకోరువంటూ మాటల దాడి చేసుకున్నారు.

Published : 29 Jun 2024 05:25 IST

బైడెన్, ట్రంప్‌ మాటల యుద్ధం
అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు వాడీవేడిగా తొలి చర్చ

అట్లాంటా: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. నువ్వు అబద్ధాలకోరువంటే.. నువ్వే అబద్ధాలకోరువంటూ మాటల దాడి చేసుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, సరి    హద్దు, విదేశాంగ విధానం, గర్భవిచ్ఛిత్తి తదితర అంశాలపై ఒకరికొకరు ప్రశ్నలు సంధించుకొని.. ఆరోపణలు గుప్పించుకున్నారు. దేశాధ్యక్ష పీఠం కోసం డెమోక్రాటిక్‌ పార్టీ నుంచి బైడెన్, రిపబ్లికన్ల తరఫున ట్రంప్‌ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి అట్లాంటాలో వీరిద్దరూ ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. దాదాపు 90 నిమిషాలపాటు ఈ సంవాదం వాడీవేడీగా సాగింది. నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి వీరిద్దరి మధ్య ఇదే తొలి ముఖాముఖి చర్చ. 

ఆర్థిక వ్యవస్థపై.. 

అమెరికాలో ద్రవ్యోల్బణం కట్టడి, ఉద్యోగాల కల్పన వంటి అంశాల్లో బైడెన్‌ ప్రభుత్వం విఫలమైందని ట్రంప్‌ విమర్శించారు. అధ్యక్షుడి ఆర్థిక విధానాలు దారుణంగా ఉన్నాయన్నారు. ఆయన సంపన్నుల అనుకూల వైఖరిని అవలంబించడంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని పేర్కొన్నారు. నిరుద్యోగిత రేటు 15%కు చేరిందన్నారు. ఆయన విమర్శలను బైడెన్‌ తిప్పికొట్టారు. పతనావస్థలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ట్రంప్‌ తనకు అప్పగించారని.. దాన్ని తాను గాడిలో పెట్టానని చెప్పారు. కొవిడ్‌ మహమ్మారి తర్వాత తన హయాంలో ఉద్యోగాలు బాగా పెరిగాయన్నారు. 

వలస విధానాలపై.. 

అక్రమ వలసదారులను బైడెన్‌ సర్కారు దేశంలోకి ఆహ్వానిస్తోందని, వారికే ఉద్యోగాలు ఎక్కువగా దక్కుతున్నాయని ట్రంప్‌ ఆరోపించారు. సక్రమ వలసదారుల ఉద్యోగాలను తొలగిస్తున్నారనీ ఆరోపణలు గుప్పించారు. వాటిని బైడెన్‌ ఖండించారు. ట్రంప్‌ కావాలనే దుష్ప్రచారానికి పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. 

రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరిస్తా: ట్రంప్‌ 

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని బైడెన్‌ సర్కారు ఆపలేకపోయిందని ట్రంప్‌ విమర్శించారు. ‘‘ఆ యుద్ధం ప్రారంభమై ఉండాల్సింది కాదు. ఉక్రెయిన్‌కు బైడెన్‌ ఇప్పటికే 20 వేల కోట్ల డాలర్లు ఇచ్చారు. అది చాలా పెద్ద మొత్తం. గతంలో ఇలాంటిదెప్పుడూ జరగలేదు! జెలెన్‌స్కీ (ఉక్రెయిన్‌ అధ్యక్షుడు) మన దేశానికి వచ్చిన ప్రతిసారీ 6 వేల కోట్ల డాలర్లు తీసుకొని వెళ్తున్నారు. నేనేమీ ఆయన్ను తప్పుబట్టట్లేదు. కానీ యుద్ధం కోసం మన డబ్బు అంత ఖర్చై ఉండాల్సింది కాదు’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే.. పుతిన్, జెలెన్‌స్కీలతో చర్చలు జరిపి ప్రమాణస్వీకారం (జనవరి 20) లోపే రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని చెప్పారు. 

ఇజ్రాయెల్‌పై ఇద్దరిదీ ఒకే మాట 

హమాస్‌తో యుద్ధంలో ఇజ్రాయెల్‌కు తమ మద్దతు కొనసాగుతుందని బైడెన్‌ పునరుద్ఘాటించారు. ట్రంప్‌ సైతం ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచారు. బైడెన్‌ వైఖరిలో మార్పు వచ్చిందని.. పాలస్తీనావాసి తరహాలో ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 


ట్రంప్‌దే పైచేయి! 

బైడెన్, ట్రంప్‌ సంవాదం అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షించింది. మరి ఈ చర్చలో ఎవరిది పైచేయి అయింది? ఈ ప్రశ్నకు అత్యధిక మంది చెబుతున్న సమాధానం- ట్రంప్‌! చర్చ జరుగుతున్నంతసేపూ ఆయన చాలా విశ్వాసంతో కనిపించారు. సూటిగా మాట్లాడారు. పలు గణాంకాలను ఉదహరించారు. వాటిలో నిజాలు ఎంతమేరకు ఉన్నాయన్న సంగతిని పక్కనపెడితే.. ఆయన మాటల్లో స్పష్టత ఉందన్నది మాత్రం వాస్తవం. బైడెన్‌ తీరు అందుకు కొంత భిన్నంగా కనిపించింది. మాట్లాడేటప్పుడు ఆయన పలుమార్లు అసంబద్ధంగా ఆగిపోయారు. ప్రధానంగా చర్చ ప్రారంభంలో తడబాటుకు గురయ్యారు. 

ఆందోళనలో డెమోక్రాట్లు 

బైడెన్‌ కొంత మతిమరుపుతో బాధపడుతున్నారని చాలాకాలంగా వార్తలొస్తున్నాయి. 81 ఏళ్ల వయసులో ఆయన మళ్లీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించడం కష్టమనీ పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ట్రంప్‌తో సంవాదంలో ఆయన పలుమార్లు తడబాటుకు గురైన తీరు స్వపక్షంలో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలకుపైగా సమయం ఉన్నందున బైడెన్‌ను కాకుండా వేరే అభ్యర్థిని బరిలో దించే అవకాశాలపైనా డెమోక్రాట్లు చర్చించుకుంటున్నారు. అయితే తాను పోటీలో కొనసాగనున్నట్లు ట్రంప్‌తో సంవాదం అనంతరం బైడెన్‌ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని