Trump-Biden Debate: బైడెన్, ట్రంప్‌ వాడీవే‘ఢీ’

ప్రపంచవ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ల చర్చ ఊహించినట్లే వాడీవేడిగా జరిగింది.

Updated : 29 Jun 2024 07:10 IST

గర్భవిచ్ఛిత్తి సహా పలు అంశాలపై పరస్పరం విమర్శలు

అట్లాంటా: ప్రపంచవ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ల చర్చ ఊహించినట్లే వాడీవేడిగా జరిగింది. ఇటీవలి కాలంలో అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గర్భవిచ్ఛిత్తి సహా పలు అంశాలు గురువారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) జరిగిన వారి సంవాదంలో ప్రస్తావనకు వచ్చాయి. వాటిపై ఇరువురు నేతలు పరస్పరం ఆరోపణలు, విమర్శలు గుప్పించుకున్నారు. అందులో కొన్నింటిని పరిశీలిస్తే..

గర్భవిచ్ఛిత్తిపై.. 

అమెరికాలో గర్భవిచ్ఛిత్తిపై నిషేధాన్ని బైడెన్‌ తప్పుబట్టారు. ఆ ప్రక్రియను అనుమతిస్తూ ‘రో వర్సెస్‌ వేడ్‌’ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. మహిళల ఆరోగ్యం గురించి వైద్యులు నిర్ణయాలు తీసుకోవాలని, రాజకీయ నాయకులు కాదని వ్యాఖ్యానించారు. గర్భవిచ్ఛిత్తి అంశాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేయాలని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. 

విదేశాంగ విధానాలపై.. 

బైడెన్‌ సర్కారు లోపభూయిష్ట విదేశాంగ విధానాలను అనుసరిస్తోందని ట్రంప్‌ విమర్శించారు. అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ అత్యంత ఘోరంగా సాగిందంటూ దుయ్యబట్టారు. గౌరవప్రదంగా సైనికులు ఆ దేశం నుంచి బయటకు వచ్చేలా తాను ఏర్పాట్లు చేశానని తెలిపారు. కానీ వాటిని అమల్లో పెట్టడంలో బైడెన్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. బైడెన్‌ స్పందిస్తూ.. ట్రంప్‌ హయాంలో తాలిబన్లు అఫ్గాన్‌ సామాన్య పౌరులను చంపారని ఆరోపించారు. దానిపై ట్రంప్‌ చర్యలు తీసుకోకపోగా.. అఫ్గాన్‌లో మరణించిన అమెరికా సైనికులను దుర్భాషలాడారంటూ మండిపడ్డారు. ఇరాక్‌లో యుద్ధంలో పోరాడి, తర్వాత మెదడు క్యాన్సర్‌తో మరణించిన తన కుమారుడు బ్యూ బైడెన్‌ను ఆయన గుర్తుచేసుకున్నారు. 

ఫలితాలను అంగీకరించడంపై.. 

గత ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం అమెరికాలో క్యాపిటల్‌ హిల్‌పై దాడి సహా పలు ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో- ‘ఈసారి ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తారా?’ అని సంవాద నిర్వాహకులు అడిగిన ఓ ప్రశ్నకు ట్రంప్‌ నేరుగా స్పందించలేదు. ఎన్నికలు చట్టప్రకారం, న్యాయంగా జరిగితే అంగీకరిస్తానని పేర్కొన్నారు. బైడెన్‌ స్పందిస్తూ.. ఈసారీ ఎన్నికల్లో ట్రంప్‌ ఓడిపోయినా ఆయన దాన్ని అంగీకరిస్తారని తాను అనుకోవడం లేదని చెప్పారు. 


నాటో నుంచి వైదొలగాలనుకుంటున్నారు

ట్రంప్‌నకు అమెరికా ప్రజాస్వామ్యంపై సరైన అవగాహన లేదని బైడెన్‌ విమర్శించారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదని ఆరోపించారు. నాటో నుంచి అమెరికా వైదొలగాలని ఆయన కోరుకుంటున్నారని చెప్పారు. మరోవైపు, తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విదేశాల్లో ఉన్న అల్‌ బాగ్దాదీ, సులేమానీ వంటి ఉగ్రవాదులను హతమార్చామని ట్రంప్‌ తెలిపారు. ఇప్పుడు ముష్కరులు అమెరికాలోకి ప్రవేశించి అమెరికన్ల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని పేర్కొన్నారు.


నాకంటే మూడేళ్లే చిన్న: బైడెన్‌ 

తన వయోభారం గురించి ప్రస్తుతం చర్చ అనవసరమని బైడెన్‌ (81) పేర్కొన్నారు. ట్రంప్‌ (78) తన కంటే మూడేళ్లు మాత్రమే చిన్న అని గుర్తుచేశారు. మరోవైపు- బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ విషయంలో ట్రంప్‌ మాటల దాడి చేశారు. తుపాకులు, మాదకద్రవ్యాల వ్యవహారాల్లో కుమారుడిని కాపాడుకునేందుకు బైడెన్‌ అనేక ప్రయత్నాలు చేశారని, చివరికి ఆయన అరెస్టు కాకుండా కాపాడుకున్నారని ఆరోపించారు. 


మరికొన్ని విశేషాలు...

  • శృంగార తార స్టార్మీ డేనియల్స్‌కు చెల్లింపుల గురించి బైడెన్‌ ప్రస్తావించినప్పుడు.. ‘పోర్న్‌స్టార్‌తో నేను శృంగారంలో పాల్గొనలేదు’ అని ట్రంప్‌ అన్నారు. 
  • భారత్, చైనా, రష్యా తమవంతుగా చెల్లింపులేవీ జరపకపోవడం వల్లే పారిస్‌ పర్యావరణ ఒప్పందం నుంచి తన హయాంలో అమెరికా 2017లో వైదొలిగినట్లు ట్రంప్‌ చెప్పారు. ఆ ఒప్పందం నుంచి బయటకు రాకపోయి ఉంటే తమ దేశంపై లక్ష కోట్ల డాలర్ల భారం పడి ఉండేదని పేర్కొన్నారు. 
  • సంవాదం సాగుతుండగా ఒక దశలో ట్రంప్, బైడెన్‌ ఇద్దరూ సంయమనం కోల్పోయారు. వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. 
  • చర్చ జరిగేటప్పుడు బైడెన్, ట్రంప్, నిర్వాహకులు తప్ప మరెవరూ లేకపోవడం గమనార్హం. పైగా ఈసారి ఒకరు మాట్లాడుతుండగా.. మరొకరి మైక్‌లను కట్‌ చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని