Rishi Sunak: చరిత్ర సృష్టించి.. సవాళ్ల నడుమ ‘సునాక్‌’ ప్రయాణం!

బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ గెలిస్తే.. అందుకు సునాక్‌ బాధ్యుడు కాదని, అంతకుముందు అధికారం చేపట్టిన కన్జర్వేటివ్‌ పార్టీ నేతల నిర్ణయాలే ఆ దుస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Published : 04 Jul 2024 21:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి వెళ్లడం కుదరదు. అందుకే చింతించే పని చేయకండి’ - ఓటర్లను ఉద్దేశించి బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ చేసిన వ్యాఖ్యలివి. సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీకే విజయావకాశాలు ఎక్కువని ఒపీనియన్‌ పోల్స్‌ వెల్లడించిన నేపథ్యంలో సునాక్‌ ఇలా వ్యాఖ్యానించారు. ఒకవేళ అదే ఫలితం వస్తే.. అందుకు సునాక్‌ బాధ్యుడు కాదని, అంతకముందు అధికారం చేపట్టిన కన్జర్వేటివ్‌ పార్టీ నేతల నిర్ణయాలే ఈ దుస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కష్ట కాలంలో బాధ్యతలు చేపట్టిన సునాక్‌ 20 నెలల పాలన మొత్తం సవాళ్ల నడుమే సాగింది!

బ్రిటన్‌ చరిత్రలో రికార్డు..

14 ఏళ్లుగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్‌ పార్టీపై కొన్నేళ్లుగా బ్రిటిషర్లలో వ్యతిరేక భావన నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టోరీలకు (కన్జర్వేటివ్‌) ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. ఇటువంటి సమయంలోనే హిందూ వర్గానికి చెందిన రిషి సునాక్‌ (42).. అక్టోబర్‌ 25, 2022న ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. గత 200 ఏళ్లలో అక్కడ అతిపిన్న వయస్కుడైన ప్రధానిగానూ ఘనత సాధించారు.

ప్రభుత్వంపై వ్యతిరేకత..

తమ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతోన్న తరుణంలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు రిషి సునాక్‌ ప్రకటించారు. ఇంగ్లాండ్‌, స్కాట్లాండ్‌, వేల్స్‌, నార్త్‌ ఐర్లాండ్‌లో మొత్తం 650 నియోజకవర్గాలు ఉండగా.. అనేక ప్రాంతాల్లో ముమ్మర ప్రచారం చేశారు. అయినప్పటికీ ఫలితాలు మాత్రం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఒపీనియన్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. 1834లో ఆ పార్టీ ఏర్పడినప్పటినుంచి ఈ స్థాయి వ్యతిరేకత ఎప్పుడూ లేదని అంచనా వేశాయి.

సవాళ్ల నడుమ..

జనవరి 31, 2020 బ్రెగ్జిట్‌ తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికలు ఇవే కావడం.. ఏళ్ల తరబడి కొనసాగిస్తున్న పొదుపు చర్యలు, బ్రెగ్జిట్‌తో మందగించిన ఆర్థిక వ్యవస్థ, కుంభకోణాలు వంటివి కన్జర్వేటివ్‌ పార్టీపై విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేశాయి. తీవ్ర అసంతృప్తి నెలకొన్న వేళ.. ఆ పార్టీ బాధ్యతలను రిషి సునాక్‌ భుజాన వేసుకున్నారు. ఇటీవల వెలుగు చూసిన బెట్టింగ్‌ రాకెట్‌ కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు అంచనా. ఇలా ఈ పరిణామాలన్నీ రిషి సునాక్‌ విజయాలను దెబ్బతీసేవేనని భావిస్తున్నారు.

మునుపటి నేతల చర్యలతో..

సునాక్‌కు ముందు ప్రధానిగా ఉన్న బోరిస్‌ జాన్సన్‌ తీరుతో కన్జర్వేటివ్‌ పార్టీ దెబ్బతింది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో జాన్సన్‌తో పాటు ఆయన బృందం పార్టీలు చేసుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది. బోరిస్‌ తర్వాత వచ్చిన లిజ్‌ ట్రస్‌ (49 రోజులు) తీరుతోనూ ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. భారీగా పన్నులు తగ్గించడం జీవన వ్యయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. వీటితోపాటు ప్రజారోగ్య వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పించడంలో వైఫల్యం వంటి పరిస్థితులు ఆ పార్టీపై విశ్వాసాన్ని మరింత దిగజార్చాయి.

ఇటువంటి సమయంలో ప్రధానిగా రిషి సునాక్‌ బాధ్యతలు చేపట్టారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ.. అనుకూల పరిస్థితుల్లో ఈ పదవి (ప్రధాని)ని చేపట్టలేదని, 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళ్లే సరైన నాయకుడిగా తాను అవుతానంటూ రిషి సునాక్‌ 2023లో పేర్కొన్నారు. పార్టీని గట్టెక్కించేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కన్జర్వేటివ్‌ పార్టీపై ప్రజల్లో విశ్వాసం కల్పించడంలో వెనుకబడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని