UK Elections: యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి

UK Elections: బ్రిటన్‌ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఓటమిపాలయ్యారు.

Updated : 05 Jul 2024 12:01 IST

లండన్‌: బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో (UK Parliament Elections) లేబర్‌ పార్టీ అఖండ విజయం సాధించింది. ప్రస్తుత ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీని గద్దెదించి.. 14 ఏళ్ల తర్వాత అధికారం చేజిక్కించుకుంది. అయితే, ఈ ఎన్నికల బరిలో నిలిచిన పలువురు భారత సంతతి అభ్యర్థులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా తెలుగు వ్యక్తులిద్దరూ ఓటమిపాలవడం గమనార్హం.

అంతర్జాతీయ వక్తగా, రచయితగా పేరొందిన ఉదయ్‌ నాగరాజు (Uday Nagaraju) ఈ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ (Labour Party) తరఫున నార్త్‌ బెడ్‌ఫోర్డ్‌షైర్‌ స్థానం పోటీ చేశారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఆయన ఓడిపోయారు. ఈ స్థానంలో కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన రిచర్డ్‌ ఫుల్లర్‌ 19,981 ఓట్లతో విజయం సాధించగా.. నాగరాజు 14,567 ఓట్లతో రెండు స్థానానికి పరిమితమయ్యారు. ఈయన స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం. యూకేలోని ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌లో పాలనా శాస్త్రంలో పీజీ పూర్తి చేశారు. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఈయన బంధువు.

క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్‌

తెలుగు సంతతి చెందిన మరో వ్యక్తి చంద్ర కన్నెగంటి (Chandra Kanneganti) కూడా ఓటమిపాలయ్యారు. ఈయన కన్జర్వేటివ్‌ పార్టీ (Conservative Party) తరఫున స్టోక్‌ ఆన్‌ ట్రెంట్‌ సెంట్రల్‌ స్థానం నుంచి పోటీ చేశారు. ఫలితాల్లో చంద్ర 6,221 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ లేబర్‌ పార్టీకి చెందిన గారెత్‌ స్నెల్‌ విజయం సాధించారు. నిజామాబాద్‌ జిల్లా కోటగిరికి చెందిన చంద్ర చదువు పూర్తయిన తర్వాత లండన్‌ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. జనరల్‌ ప్రాక్టిషనర్‌గా సేవలందిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. స్టోక్‌ ఆన్‌ ట్రెంట్‌ నగరంలో రెండుసార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి మేయర్‌గానూ పని చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని