US shootings: అమెరికాలో కాల్పులు.. ఐదుగురి మృతి.. దుండగుడి ఆత్మహత్య!

US shootings: లాస్‌ వెగాస్‌లో తుపాకీతో ఐదుగురు సామాన్యులను పొట్టనబెట్టుకున్న దుండగుడు.. చివరకు తనని తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Published : 26 Jun 2024 08:43 IST

US shootings | లాస్‌ వేగాస్‌: అమెరికాలోని లాస్ వెగాస్ సమీపంలో ఉన్న అపార్ట్‌మెంట్లలో ఐదుగురిని కాల్చి చంపి, 13 ఏళ్ల బాలికను తీవ్రంగా గాయపరిచిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు మంగళవారం వెల్లడించారు. నార్త్ లాస్ వెగాస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఎదురుపడటంతో నిందితుడు ఎరిక్ ఆడమ్స్ (57) మంగళవారం ఉదయం తనని కాల్చుకున్నట్లు తెలిపారు. వేర్వేరు అపార్ట్‌మెంట్లలో సోమవారం రాత్రి కాల్పులు జరిపినప్పటి నుంచి అధికారులు అతడి కోసం గాలిస్తున్నారు.

నార్త్ లాస్ వెగాస్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో సోమవారం అర్ధరాత్రి కాల్పులు జరిగినట్లు వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇద్దరు మహిళలు చనిపోయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు మరింత లోపలికి వెళ్లగా.. 13 ఏళ్ల బాలిక తీవ్రమైన తుపాకీ గాయాలతో ఉండడం గమనించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమీపంలోని మరో అపార్ట్‌మెంట్లో ఇద్దరు మహిళలు, ఓ యువకుడి మృతదేహాలను గుర్తించారు. దుండగుడి కాల్పుల్లో మొత్తం ఐదుగురు చనిపోయారని పోలీసులు నిర్ధరించారు.

దీంతో ప్రమాదకారి అయిన ఓ సాయుధుడు సమీపంలో ఉన్నాడంటూ స్థానికులను పోలీసులు అప్రమత్తం చేశారు. అతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఒక దుకాణం దగ్గరల్లో నిందితుడు కనిపించాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకోగా దుండగుడు తుపాకీతో సమీపంలోని ఇంటి పెరట్లోకి పరిగెత్తాడు. తుపాకీ విడిచిపెట్టి లొంగిపోవాలని కోరినప్పటికీ అతడు నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. చివరకు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. కాల్పులకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు