Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు ఎమర్జెన్సీ.. సురక్షిత స్థానాలకు వ్యోమగాములు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొద్దిసేపు అత్యవసర పరిస్థితి తలెత్తింది. దీనికి అత్యంత సమీపంలోనే ఓ పాత మృత ఉపగ్రహం శకలాలుగా మారిపోయింది. ఇవి ఐఎస్‌ఎస్‌ (ISS) కు ముప్పు కావచ్చని తొలుత ఆందోళన చెందారు. 

Updated : 28 Jun 2024 14:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల కొద్దిసేపు ఎమర్జెన్సీ నెలకొంది. దీంతో వ్యోమగాములు సునీతా విలియమ్స్‌(Sunita Williams), బచ్‌ విల్మోర్‌లు తప్పనిసరిగా బోయింగ్‌ స్టార్‌లైనర్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌లో తలదాచుకోవాల్సి వచ్చింది. ఐఎస్‌ఎస్‌కు అత్యంత సమీపంలో భారీగా ఉపగ్రహ వ్యర్థాలు సంచరించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. 

బుధవారం ఐఎస్‌ఎస్‌కు దగ్గరగా ఓ ఉపగ్రహం ముక్కలై శకలాలను విడుదల చేసినట్లు నాసా గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకు చేరవేసింది. దీంతో నిర్దేశిత ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా సిబ్బంది మొత్తాన్ని వారికి సంబంధించిన స్పేస్‌క్రాఫ్ట్‌ల్లోకి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జూన్‌ 5 నుంచి అక్కడ ఉన్న విలియమ్స్‌, విల్మోర్‌లు స్టార్‌లైనర్‌ క్యాప్సుల్‌లో తల దాచుకొన్నారు.

దాదాపు గంటసేపు మిషిన్‌ కంట్రోల్స్‌ ఇక్కడి వ్యర్థాలు ప్రయాణించే మార్గాన్ని సునిశితంగా పరిశీలించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కొద్దిసేపటి తర్వాత ముప్పులేదని నిర్ధారించుకొని వ్యోమగాములకు క్లియరెన్స్‌ ఇచ్చారు. 

రష్యాకు చెందిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ ఉపగ్రహం రిస్యూర్స్‌-1 రెండేళ్ల క్రితం నిరుపయోగంగా మారింది. ఇది బుధవారం దాదాపు 100 ముక్కలుగా విడిపోయింది. ఈ పరిణామాలు మొత్తం ఐఎస్‌ఎస్‌కు అత్యంత సమీపంలోనే చోటు చేసుకొన్నాయి. కొన్ని గంటల పాటు దీనినుంచి శకలాలు వెలువడ్డాయని లియోల్యాబ్స్‌ అనే స్పేస్‌ ట్రాకింగ్‌ సంస్థ పేర్కొంది. మరోవైపు రష్యాకు చెందిన రాస్‌కాస్మోస్‌ ఏజెన్సీ నుంచి ఎటువంటి వివరణ వెలువడలేదు. ఇప్పటికే అంతరిక్షంలో వేల సంఖ్యలో ఉపగ్రహ శకలాలు సంచరిస్తున్నాయి. ఇవి ప్రస్తుతం పనిచేస్తున్న శాటిలైట్లకు ప్రమాదకరంగా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని