UK Elections: బాధ్యత వహించినా.. సునాక్‌ కేవలం బాధితుడేనా!

బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని రిషి సునాక్‌ పేర్కొన్నప్పటికీ.. అంతకుముందు అధికారం చేపట్టిన టోరీల నిర్ణయాలే ఈ దుస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Published : 05 Jul 2024 16:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘన విజయంతో 14ఏళ్ల కన్జర్వేటివ్‌ల పాలనకు తెరపడింది. కష్టకాలంలో పాలనా పగ్గాలు చేపట్టిన రిషి సునాక్‌.. ఓటమిని అంగీకరిస్తూ, ఇదో ‘కష్టమైన రాత్రి’ అని పేర్కొన్నారు. పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్నప్పటికీ అంతకుముందు అధికారం చేపట్టిన టోరీల నిర్ణయాలే ఈ దుస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కన్జర్వేటివ్‌ పార్టీ ఓటమికి గల పలు కారణాలను పరిశీలిస్తే..

  • అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. కన్జర్వేటివ్‌ పార్టీ ఓటమికి ప్రధాన కారణం ఆ పార్టీపై ఓటర్లలో నెలకొన్న నిరాసక్తత. బ్రిటన్‌లో ఏ రాజకీయ పార్టీ కూడా వరుసగా ఐదోసారి విజయం సాధించలేదు. అక్కడ రెండు ప్రధాన పార్టీల మధ్య 10 నుంచి 15ఏళ్లకు ఓసారి పరస్పర అధికార మార్పిడి జరిగే తీరు కనిపిస్తోంది.
  • టోరీలు (కన్జర్వేటివ్‌) 1979 నుంచి 1997 వరకు అధికారంలో ఉండగా, లేబర్‌ పార్టీ 1997 నుంచి 2010 వరకు ఉంది. ఆ తర్వాత మళ్లీ టోరీలు అధికారం చేపట్టారు. ఇలా రెండు పార్టీల మధ్య అధికార బదలాయింపునకు ఓటర్లు జై కొడుతున్నారు.
  • టోరీలు తీసుకున్న పలు నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ మందగించిందనే వాదన ఉంది. పన్నుల వ్యవహారం, రికార్డు స్థాయిలో వలసలు వంటి అంశాలు తాజా రాజకీయాల్లో నిగెల్‌ ఫరేజ్‌ వంటి నాయకుడిని తెరమీదకు తేవడానికి కారణమైనట్లు చెబుతుంటారు.
  • నిగెల్‌ సారథ్యంలో రిఫార్మ్‌ యూకే వంటి కొత్త పార్టీ పుట్టుకు రావడమే కాకుండా తాజా ఎన్నికల్లో దాదాపు 15శాతం ఓట్లు పొందడం గమనార్హం. నిగేల్‌ తొలిసారి విజయం సాధించడంతో పాటు నాలుగు స్థానాల్లో ఆ పార్టీ గెలుపొందింది. ఇవన్నీ కన్జర్వేటివ్‌కు గండికొట్టినవేనని తెలుస్తోంది. ఇది ఇబ్బందికర పరిణామమేననే కలవరం టోరీల్లో నెలకొనడంతోపాటు ఎన్నికల తర్వాత ఈ పరిస్థితి మరింత క్షీణించవచ్చనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో మొదలైంది.

కుంభకోణాలు, వివాదాస్పద నిర్ణయాలు..

  • ఏళ్ల తరబడి కొనసాగిస్తున్న పొదుపు చర్యలు, బ్రెగ్జిట్‌తో మందగించిన ఆర్థిక వ్యవస్థ, జీవన వ్యయం భారీగా పెరిగిపోవడం, వరుస కుంభకోణాలు వంటివి కన్జర్వేటివ్‌ పార్టీపై ఓటర్లలో విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేశాయి.
  • ముఖ్యంగా కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ప్రధానిగా ఉన్న బోరిస్‌ జాన్సన్‌ పార్టీలు చేసుకున్న వ్యవహారం వెలుగు చూడటం, ఆ తర్వాత పాలనా పగ్గాలు చేపట్టిన లిజ్‌ ట్రస్‌ నిర్ణయాలతో మార్కెట్ కుదేలవడం వంటివి పార్టీ స్థాయిని మరింత దిగజార్చాయి.
  • ఎన్నికల ప్రచారం సమయంలోనే పార్టీ సహచరుల బెట్టింగ్‌ కుంభకోణం వెలుగు చూడటం కూడా సునాక్‌ ప్రభుత్వంపై విమర్శలకు కారణమైంది.
  • ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సునాక్‌ తీసుకున్న నిర్ణయంపై సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపడినప్పటికీ.. బోరిస్‌, లిజ్‌ ట్రస్‌ల తీరుతోనే పార్టీ పతనమైందని సొంత పార్టీ నేతలే వాదిస్తున్నారు. ఇందులో సునాక్‌  పాత్ర ఏమీ లేదని, కేవలం ఆయన బాధితుడు మాత్రమేనని చెబుతున్నారు.
  • ఈ నష్టాల నుంచి పార్టీని గట్టెక్కించేందుకు రిషి సునాక్‌ ప్రయత్నాలు చేసినప్పటికీ.. ప్రజలతో మమేకమయ్యేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఓ సంపన్నుడికి సాధారణ పౌరుల ఇబ్బందులు ఎలా తెలుస్తాయనే విమర్శలు కూడా ఆయన ఎదుర్కొన్నారు.
  • జీవన వ్యయ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పడంతో పాటు సమర్థ, నైతిక పాలన అందిస్తామనే హామీలతో కియర్‌ స్టార్మర్‌ సారథ్యంలోని లేబర్‌ పార్టీ ఓ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం తాజా ఎన్నికల్లో ఘన విజయానికి దోహదం చేసినట్లు అంచనా.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని