Donald Trump: తొలి డిబేట్‌లో దూకుడు.. ‘ట్రంప్‌ మీడియా’ షేర్లు పైపైకి!

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ బరిలో ఉన్న జో బైడెన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య జరిగిన తొలి డిబేట్‌ అనంతరం..‘ట్రూత్‌ సోషల్‌’ షేర్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

Published : 28 Jun 2024 23:08 IST

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ బరిలో ఉన్న జో బైడెన్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ల మధ్య తొలి డిబేట్‌ వాడీవేడీగా సాగింది. ఇందులో దూకుడుగా వ్యవహరించిన మాజీ అధ్యక్షుడు ట్రంపే పైచేయి సాధించినట్లు సర్వేలు పేర్కొన్నాయి. దీంతో ఆయనకు చెందిన సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’ షేర్లు ఒక్కసారిగా ఐదు శాతం పెరిగిపోయాయి. ఒకవేళ ట్రంప్‌ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే ఈ వేదికే ఆయనకు అతిపెద్ద గొంతుక అవుతుందని పెట్టుబడిదారులు విశ్వసిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

చర్చ అనంతరం మీడియాలో వచ్చిన ఫలితాల ఆధారంగా ట్రంప్‌ మీడియా సంస్థపై ఆసక్తి పెరిగినట్లు కనిపిస్తోందని సిటీ గ్రూపునకు చెందిన విశ్లేషకులు పేర్కొన్నారు. ‘హష్‌మనీ’ కేసు విచారణ సమయంలో ఆ కంపెనీ షేర్లు పతనమయ్యాయి. గత త్రైమాసికంలో దాదాపు 300 మిలియన్‌ డాలర్లకుపైగా నష్టపోయినట్లు మే నెల నివేదికలో సంస్థ పేర్కొంది. తాజా చర్చ పూర్తయిన తర్వాత మొదలైన ట్రేడింగ్‌లో ఒకేసారి ఐదుశాతం పెరగడం గమనార్హం.

ట్రంప్‌ దూకుడు.. బైడెన్‌ తడబాటు.. ఆసక్తికరంగా అధ్యక్ష అభ్యర్థుల చర్చ

2020 అధ్యక్ష ఎన్నికల తర్వాత తొలిసారిగా ముఖాముఖి తలపడిన ఇద్దరునేతలు.. అబార్షన్లు, వలసవాదం, 2020 క్యాపిటల్‌ దాడులు, సామాజిక భద్రత, ట్రంప్‌పై కేసులు, నాటో వంటి అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. ఒకానొక దశలో సంయమనం కోల్పోయి వ్యక్తిగత విమర్శలకూ దిగారు. మొత్తంగా ఇందులో మాజీ అధ్యక్షుడు దూకుడు ప్రదర్శించగా.. బైడెన్‌ కొన్నిచోట్ల తడబడ్డట్లు కనిపించారు. అట్లాంటాలోని సీఎన్‌ఎన్‌ ప్రధాన కార్యాలయం ఈ డిబేట్‌కు వేదికైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని