LAC: ‘వాస్తవాధీన రేఖ’ను గౌరవించాల్సిందే - చైనాకు జైశంకర్‌ స్పష్టం

సరిహద్దులో నెలకొన్న ఇతర సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ చైనాకు స్పష్టం చేశారు.

Published : 04 Jul 2024 14:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాస్తవాధీన రేఖ (LAC)ను గౌరవించడంతోపాటు సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాల్సిందేనని భారత విదేశాంగశాఖ చైనాకు స్పష్టంచేసింది. వీటితోపాటు సరిహద్దులో నెలకొన్న ఇతర సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. కజఖిస్థాన్‌లోని అస్తానాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక సదస్సులో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ (S Jaishankar) భేటీ అయ్యారు. భారత్‌-చైనా సరిహద్దులో, ముఖ్యంగా లద్ధాఖ్‌తోపాటు వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న వివాదాల పరిష్కార మార్గాలపై ఇరువురు నేతల బృందం చర్చించింది.

‘‘ఎల్‌ఏసీని గౌరవించడం, సరిహద్దులో శాంతిని నెలకొల్పడం ఎంతో అవసరం. పరస్పర గౌరవం, పరస్పర మనోభావాలు, పరస్పర ప్రయోజనాలు అనే మూడు అంశాలు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను నిర్దేశిస్తాయి’ అని విదేశాంగ మంత్రి జై శంకర్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. వీటితోపాటు సరిహద్దులో నెలకొన్న ఇతర సమస్యలపైనా వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని చైనాకు నొక్కిచెప్పారు. సైనిక, దౌత్య మార్గాల్లో ఈ ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు ఇరువురు మంత్రులు అంగీకరించినట్లు సమాచారం.

చర్చ సమయంలో దాదాపు నిద్రపోయాను - జో బైడెన్‌

తూర్పు లద్ధాఖ్‌లో సరిహద్దు వివాదం నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉంది. 2020లో గల్వాన్‌ లోయలో ఇరుదేశాల సైన్యం మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు జరగడం.. అప్పటినుంచి ఆ ప్రాంతంలో ఇరుదేశాలు భారీ సంఖ్యలో సైన్యాలను మోహరించాయి. అనంతరం అనేక దఫాల్లో సైనికాధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. దాంతో కొన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి తమ సైన్యాలను ఉపసంహరించుకున్నప్పటికీ వాస్తవాధీన రేఖ వెంట అనేక ప్రాంతాల్లో వివాదాలు అలాగే కొనసాగుతున్నాయి. ఇలా ఉద్రిక్త పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగడం రెండు దేశాలకు మంచిది కాదని ఎస్‌.జైశంకర్‌ పలుమార్లు ఉద్ఘాటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని