UK Election Results: యూకే ఎన్నికల ఫలితాలు.. రిషి సునాక్‌పై మోదీ పోస్టు

యూకే ఎన్నికల ఫలితాల వేళ.. దాదాపు రెండేళ్ల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన రిషి సునాక్‌ (Rishi Sunak)ను ఉద్దేశించి మోదీ(Modi) పోస్టు పెట్టారు. 

Published : 05 Jul 2024 16:25 IST

దిల్లీ: బ్రిటన్‌ పార్లమెంట్ ఎన్నికల్లో (UK Election Results) అధికార కన్జర్వేటివ్ పార్టీని ఓడించి లేబర్‌ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ ఫలితాలపై భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) స్పందించారు. బ్రిటన్‌కు తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న కీర్‌ స్టార్మర్‌కు అభినందనలు తెలియజేశారు. అలాగే భారత అల్లుడు, ఇంతకాలం ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన రిషి సునాక్‌ను ప్రశంసించారు.

‘‘అనిర్వచనీయమైన విజయాన్ని దక్కించుకున్న కీర్‌ స్టార్మర్‌కు హృదయపూర్వక అభినందనలు. అన్ని రంగాల్లో భారత్‌-యూకే సంబంధాల బలోపేతం దిశగా నిర్మాణాత్మక సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం’’ అని మోదీ ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చారు. అలాగే సునాక్‌ను ఉద్దేశించి మరో పోస్టు పెట్టారు. యూకేను పాలించడంలో అద్భుతమైన పనితీరు చూపారని ప్రశంసించారు. ప్రధానిగా ఉన్న సమయంలో రెండు దేశాల బంధం బలోపేతం దిశగా చూపిన చొరవకు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తు ప్రయాణం బాగుండాలని ఆకాంక్షిస్తూ సునాక్‌తో పాటు ఆయన కుటుంబానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్‌

శుక్రవారం జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో లేబర్‌ పార్టీ నాలుగు వందలకు పైగా సీట్లు దక్కించుకోగా.. కన్జర్వేటివ్ పార్టీ 120 సీట్ల దగ్గర ఆగిపోయింది. పార్టీ ఘోర పరాభవానికి తాను బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటికే సునాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండేళ్లక్రితం ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్.. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని