Joe Biden: అవును నేను వృద్ధుడినే.. కానీ: డిబేట్‌లో తడబాటు వేళ బైడెన్ ఏమన్నారంటే..?

ట్రంప్‌ (Trump)తో జరిగిన సంవాదంలో బైడెన్‌ (Biden) తడబాటుకు గురయ్యారు. దీని గురించి ఆందోళన వ్యక్తమవుతోన్న తరుణంలో అధ్యక్షుడు స్పందించారు.  

Updated : 29 Jun 2024 10:59 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలల సమయమే ఉండగా.. అధ్యక్షుడు జోబైడెన్‌ (Joe Biden), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) మధ్య జరిగిన సంవాదం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ చర్చ సమయంలో బైడెన్‌ పలుమార్లు తడబాటుకు గురైన తీరు స్వపక్షం డెమోక్రాటిక్ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది.

ఈ నేపథ్యంలో తన వయసును ఉద్దేశించి బైడెన్‌ స్పందించారు. ‘‘అవును నేను యువకుడిని కాదని నాకు తెలుసు. గతంలో మాదిరిగా చలాకీగా నడవలేను. అప్పటిలా స్పష్టంగా మాట్లాడలేను. మునుపటి మాదిరిగా చర్చించలేకపోవచ్చు. కానీ నాకు నిజం ఎలా చెప్పాలో తెలుసు. నా పనిని సక్రమంగా ఎలా చేయాలో తెలుసు. ఎవరైనా కిందపడిపోయినప్పుడు.. తిరిగి మళ్లీ పైకి లేస్తారు. అధ్యక్ష పదవిని నేను నిర్వర్తించగలనని మనస్ఫూర్తిగా నమ్మాను కాబట్టే మళ్లీ పోటీలో ఉన్నా’’ అని తన డిబేట్‌పై వస్తోన్న విమర్శలకు అధ్యక్షుడు ఇలా బదులిచ్చారు.

నువ్వు అబద్ధాలకోరువి.. కాదు నువ్వే

మరోవైపు మాజీ అధ్యక్షుడు, స్వపక్ష నేత బరాక్‌ ఒబామా ఆయనకు అండగా నిలిచారు. ‘‘చర్చలు సరిగా జరగని రోజులు ఉంటాయి. అయితే నన్ను నమ్మండి. సాధారణ ప్రజల కోసం జీవితమంతా పోరాడిన వ్యక్తికి (బైడెన్‌), తన గురించి మాత్రమే పట్టించుకునే వ్యక్తి (ట్రంప్‌ను ఉద్దేశిస్తూ)కి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకరు నిజం చెప్పే వ్యక్తి- మరొకరు సొంత ప్రయోజనాల కోసం అబద్ధాలు చెప్పే వ్యక్తి.. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం కోసం జరుగుతున్న ఎన్నికలివి. ఒక్క డిబేట్‌ దానిని నిర్ణయించలేదు’’ అని మద్దతుగా నిలిచారు.

చర్చలో ట్రంప్‌ పైచేయి సాధించినట్లు సీఎన్‌ఎన్‌ పోల్‌లో మెజారిటీ వీక్షకులు అభిప్రాయపడ్డారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ సైతం బైడెన్‌ చర్చను నెమ్మదిగా ప్రారంభించినట్లు తెలిపారు. కానీ, చివరకు హుందాగా, దీటుగా ముగించారని పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలలకుపైగా సమయం ఉన్నందున బైడెన్‌ను కాకుండా వేరే అభ్యర్థిని బరిలో దించే అవకాశాలపైనా డెమోక్రాట్లు చర్చించుకుంటున్నారు. అయితే తాను పోటీలో కొనసాగనున్నట్లు ట్రంప్‌తో సంవాదం అనంతరం బైడెన్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని