Nigeria:: తొలుత పెళ్లి.. తర్వాత అంత్యక్రియలు.. వారే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి

Nigeria: నైజీరియాలో జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో కనీసం 18 మంది మృతిచెందారు. మరో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

Updated : 30 Jun 2024 10:48 IST

Nigeria | అబుజా: నైజీరియాలో (Nigeria) వరుస ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో కనీసం 18 మంది మృతిచెందారు. దాదాపు మరో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

వివాహ వేడుకలో..

స్థానిక ప్రభుత్వ ఎమర్జెన్సీ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశ ఈశాన్య ప్రాంతంలోని బోర్నో రాష్ట్రం గ్వోజా పట్టణంలో శనివారం ఈ దాడులు (Nigeria suicide bomb attacks) జరిగాయి. మహిళా ఆత్మాహుతి బాంబర్లు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. చిన్నారిని ఎత్తుకున్న ఓ మహిళ గ్వోజా పట్టణంలో శనివారం జరిగిన వివాహ కార్యక్రమంలో తనని తాను పేల్చుకున్నట్లు స్థానిక పోలీసులను ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ కథనాన్ని ప్రచురించింది. అదే పట్టణంలో మరో మహిళ ఆసుపత్రిలో ఆత్మాహుతి దాడికి పాల్పడింది. వీటి నుంచి తేరుకోక ముందే వివాహ కార్యక్రమంలో మరణించిన వారికి నిర్వహిస్తున్న అంత్యక్రియల్లో మరో మహిళ తన శరీరానికి అమర్చుకున్న ఐఈడీని పేల్చుకుంది. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు సహా ఓ గర్భవతి కూడా ఉన్నట్లు సమాచారం.

దశాబ్దకాలంగా..

బోర్నో రాష్ట్రం దశాబ్ద కాలంగా ఇస్లామిస్ట్ తిరుగుబాటుకు కేంద్రంగా ఉంది. కొన్నేళ్లుగా జరుగుతున్న హింసాకాండలో దాదాపు 40 వేల మందికి పైగా మరణించారు. 20 లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇక్కడ తరచూ బోకో హరామ్‌, దాని అనుబంధ ఇస్లామిక్‌ స్టేట్‌ వెస్ట్‌ ఆఫ్రియా ప్రావిన్స్‌ అనే ఉగ్రసంస్థలు దాడులకు పాల్పడుతుంటాయి. తాజా ఘటనలకు బాధ్యత వహిస్తూ మాత్రం ఇప్పటి వరకు అవి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. 2014లో గ్వోజాను బోకో హరామ్‌ తమ అధీనంలోకి తీసుకుంది. కానీ, ఛాద్‌ సైన్యం మద్దతుతో నైజీరియా తిరిగి దాన్ని స్వాధీనం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు