Birds: పిట్ట కొంచెం.. కిక్కు ఘనం..!

పక్షుల వ్యవహారశైలి చాలా వింతగా ఉంటుంది. కొన్ని విహంగాలు ఘాటైన రసాయనాల కోసం గాలిస్తుంటాయి.

Updated : 01 Jul 2024 08:12 IST

ఈనాడు ప్రత్యేక విభాగం

పక్షుల వ్యవహారశైలి చాలా వింతగా ఉంటుంది. కొన్ని విహంగాలు ఘాటైన రసాయనాల కోసం గాలిస్తుంటాయి. ఆస్ట్రేలియాలోని నార్‌ఫోక్‌ దీవిలోని పచ్చని చిలుకలు ఇందుకు ఉదాహరణ! ఇవి మిరియాల తీగను నమిలి ఆ పిప్పిని తమ ఈకలపైకి వెదజల్లుకోవడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. 

కొన్ని విహంగాలు పనిగట్టుకొని.. చీమలను సేకరించి, ఈకలపై చల్లుకుంటాయి. 

మరికొన్ని పక్షులేమో బాగా పండిపోయిన పండ్లను ఏరికోరి తింటాయి. ఈ క్రమంలో అనారోగ్యం పాలవుతుంటాయి కూడా! అయినా ఆ అలవాటు మానుకోవు.  

ఈ వ్యవహారశైలి వెనుక లోగుట్టు చాలాకాలం పాటు శాస్త్రవేత్తలకు అంతుచిక్కకుండా ఉంది. ఇందుకు పలు అంశాలు దోహదపడుతున్నా.. ప్రధానంగా ఈ పక్షులు ‘కిక్కు’ కోసమే ఇలా చేస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ చర్యల ద్వారా అవి ఉల్లాసం.. ఉత్సాహం పొందుతున్నట్లు తేల్చారు. 

పారవశ్యం కోసం.. 

హానికర పరాన్నజీవుల నుంచి రక్షణ పొందడానికే మిరియాల తీగను నమిలి, ఆ పిప్పిని ఈకలపైకి వెదజల్లుకుంటున్నాయని శాస్త్రవేత్తలు భావించారు. మిరియాల తీగలోని పిపరీన్‌ అనే పదార్థంలో ఔషధ లక్షణాలు ఉన్నాయి.  

పక్షులు చీమలను మీద వేసుకోవడాన్ని యాంటింగ్‌ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వీయ రక్షణ కోసం చీమలు.. ఫార్మిక్‌ యాసిడ్‌ను విడుదల చేస్తాయి. 

ఫార్మిక్‌ యాసిడ్, పిపరీన్‌లు ఘాటైన రసాయనాలు. వాటికి ఔషధ గుణాలతోపాటు కీటకాలను దరిచేరకుండా చేసే లక్షణాలు ఉన్నాయి. అవి ఉత్ప్రేరకాలుగానూ పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. మిరియాల తీగ పిప్పిని శరీరానికి పులుముకునేటప్పుడు చిలుకలు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించాయి. అందువల్ల ఆనందం కోసం కూడా అవి ఇలా చేస్తుండొచ్చని భావిస్తున్నారు. 

యాంటింగ్‌ వల్ల ఆమోదయోగ్య ప్రభావం ఉంటుందని 1931లో ఆల్ఫ్రెడ్‌ ట్రోషచజ్‌ అనే ప్రకృతి ప్రేమికుడు చెప్పారు.  తాను అధ్యయనం చేసిన ఒక పక్షి.. యాంటింగ్‌ ద్వారా మానసిక ఉద్దీపనలు పొందడాన్ని గుర్తించానని 1957లో అమెరికా శాస్త్రవేత్త లోవీ విటేకర్‌ పేర్కొన్నారు. ఇందులో శృంగార ఉద్దీపన కూడా ఉండొచ్చన్నారు. ఆమె అభిప్రాయాలను నాడు కొందరు శాస్త్రవేత్తలు కొట్టిపారేశారు. 

అయితే యాంటింగ్‌ వల్ల పక్షుల్లో పారవశ్య స్థితిని ఆ తర్వాత కొందరు పరిశోధకులు గమనించారు. చీమలను మీద వేసుకున్నాక.. ఆస్ట్రేలియా మ్యాగ్‌పై పక్షులు ఈకలను విప్పార్చడం, శరీరాన్ని ఒకింత మెలితిప్పడం, తడబడినట్లు నడవడం, విచిత్రంగా స్పందించడం వంటి లక్షణాలను ప్రదర్శించడాన్ని వారు చూశారు. చీమల్లోని టాక్సిన్లలో చిత్తభ్రమలు కలిగించే కొన్ని పదార్థాలను గుర్తించారు. అందులో ఫార్మిక్‌ యాసిడ్‌ కూడా ఒకటి. 


మైకంలో గగనవిహారం

ద్యపానం అలవాటున్నవారు ఆల్కహాల్‌ కోసం పిచ్చెక్కిపోతుంటారు. పక్షులు కూడా ఆల్కహాల్‌ కోసం ఇదే రీతిలో వెంపర్లాడటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం అవి.. బాగా పండి, పులిసిన పండ్లు, బెర్రీలను తింటుంటాయి. ఫలితంగా కిక్కు నషాళానికెక్కి.. ఒళ్లు తెలియని స్థితిలోకి జారిపోతుంటాయి. ఆ దశలో అవి కిటికీలు, వాహనాలను ఢీ కొట్టడం, పిల్లులు వంటి జంతువులకు ఆహారంగా దొరికిపోవడం జరుగుతుంటుంది. ఒక్కోసారి ఇది వికటించి ‘ఆల్కహాల్‌ పాయిజనింగ్‌’కూ దారితీస్తుంటుంది. 

  • 2021లో ఇలా ‘తప్పతాగిన’ కొన్ని రెడ్‌ వింగ్డ్‌ ప్యారెట్లను పశ్చిమ ఆస్ట్రేలియాలోని బ్రూమ్‌ వెటర్నరీ ఆసుపత్రికి అప్పగించారు. ఇవి బాగా పండిపోయిన మామిడి పండ్లను ఆరగించినట్లు గుర్తించారు. 
  • న్యూజిలాండ్‌లో కెరెరు అనే ఒక రకం పావురానికి ఈ అలవాటు ఉంది. ఈ జాతి పక్షులు తరచూ మత్తులోకి జారిపోతుంటాయి. చెట్ల మీద నుంచి కిందకు పడిపోతుంటాయి. 

ఇందుకే.. 

పండ్లు పండేకొద్దీ తియ్యగా మారిపోతుంటాయి. ఎక్కువ పోషకాలను సంతరించుకుంటాయి. అవి మరింత పండితే వాటిలోని చక్కెర పులిసిపోతుంది. ఫలితంగా అందులో ఆల్కహాల్‌ గాఢత పెరుగుతుంది.  

ఈ పండ్ల కోసం పక్షులు వెంపర్లాడటం వెనుక లోతైన పరిణామక్రమ సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పండ్లు పులిసే సమయంలో ఉత్పత్తయ్యే వోలటైల్‌ పదార్థాలు (ఆల్కహాల్స్‌).. గాల్లో వ్యాప్తి చెందుతాయి. తద్వారా పోషకాలతో కూడిన ఆహారాన్ని వెతికి పట్టుకోవడంలో పక్షులకు సాయం చేస్తాయి. ఇథనాల్‌ అనేది ఒకవిధంగా శక్తికి మంచి వనరు. అది ఆకలిని పెంపొందిస్తుంది. ఫలితంగా పక్షికి మేలు జరుగుతుంది. అలాగే.. ఆ పండు విత్తనాల వ్యాప్తికీ ఇది దోహదపడుతుంది. 

సాధారణంగా.. ఈ పండ్ల వల్ల పక్షుల్లో కిక్కు స్వల్పంగానే ఉంటుంది. తప్పతాగినట్లు వ్యవహరించే కేసులు చాలా అరుదు. 


మానవుల్లోనూ.. 

ఫార్మిక్‌ యాసిడ్‌ను కండరాల శక్తిని పెంచుకోవడానికి, అలసట భావాన్ని తగ్గించుకోవడానికి వాడుతుంటారు. ఆరోగ్యాన్ని, జీర్ణశక్తిని, లైంగిక వాంఛలను మెరుగుపరచుకోవడానికి 17వ శతాబ్దంలో ఐరోపాలో ఉపయోగించిన ఒక టానిక్‌లోని రహస్య పదార్థం ఇదే అయి ఉంటుందని భావిస్తున్నారు. 

దక్షిణ కాలిఫోర్నియాలోని దేశీయ తెగలవారు.. రెడ్‌ హార్వెస్టర్‌ చీమలను వైద్య అవసరాలకు, మతపరమైన కార్యక్రమాలకు ఉపయోగించేవారు. ఈ కీటకాలను వారు సజీవంగా, భారీ పరిమాణంలో తినేవారు. తద్వారా చిత్తభ్రమల్లోకి జారిపోయేవారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని