ఆన్‌లైన్‌ గేమ్‌లో గొడవ.. గేమర్‌ను హతమార్చేందుకు 750 కి.మీల ప్రయాణం!

ఆన్‌లైన్‌ గేమ్‌లో పాల్గొన్న ఇద్దరు యువకులు ఏదో కారణంపై గొడవపడ్డారు. దీంతో ఓ యువకుడు తోటి గేమర్‌ను హతమార్చేందుకు 750 కిలోమీటర్లు ప్రయాణించాడు. 

Updated : 26 Jun 2024 19:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్ గేమ్‌ (Online Game)కు బానిసగా మారి కొందరు మతిస్థిమితం కోల్పోయారంటూ తరచూ వార్తలు వింటున్నాం. కానీ, ఓ వ్యక్తి ఆన్‌లైన్‌ గేమ్‌లో గొడవ పడిన మరో గేమర్‌ను హతమార్చేందుకు ఏకంగా వందల కిలోమీటర్లు ప్రయాణించాడు. నేరుగా అతడి నివాసానికి వెళ్లి సుత్తితో యువకుడి తలను పగలగొట్టాడు. ఈ ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళ్తే..

న్యూజెర్సీకి చెందిన ఎడ్వర్డ్‌ కాంగ్‌ ఆన్‌లైన్‌ గేమింగ్‌కు బానిసగా మారాడు. గేమ్‌ ఆడుతున్న క్రమంలో మరో గేమర్‌తో ఏదో కారణంతో వాగ్వాదానికి దిగాడు. గొడవ కాస్తా ముదరడంతో కాంగ్‌ ఆగ్రహానికి గురయ్యాడు. ఆ వ్యక్తిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అతడి వివరాలు తెలుసుకున్నాడు. స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్నానని తల్లికి చెప్పి ఫ్లోరిడాకు బయలుదేరాడు. అలా 750 కిలోమీటర్లు ప్రయాణించి తోటి గేమర్‌ నివాసానికి చేరుకున్నాడు.

ఇంటి తలుపులు తెరచి ఉండడంతో లోనికి వెళ్లాడు. అప్పుడే గది నుంచి బయటకు వస్తున్న యువకుడి తలపై సుత్తితో బలంగా కొట్టాడు. ఇది గమనించిన బాధితుడి తండ్రి కాంగ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని ఆస్పత్రికి తరలించారు.

వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు అసాంజేకు విముక్తి.. సొంత దేశం ఆస్ట్రేలియాకు పయనం

బాధితుడికి ప్రాణపాయం తప్పినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. ఇలాంటి ఘర్షణల నేపథ్యంలో యూరప్‌, నార్త్‌ అమెరికాలో తమ సర్వర్‌లను నిలిపివేస్తున్నట్లు సదరు గేమింగ్‌ సంస్థ ప్రకటించడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని