Biden-Trump debate: ట్రంప్‌-బైడెన్‌ ‘డిబేట్‌’.. కోట్లాది అమెరికన్లలో ఉత్కంఠ!

అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లు ప్రత్యక్ష చర్చకు సిద్ధమయ్యారు. గురువారం (జూన్‌ 27న) జరిగే ఈ ‘డిబేట్‌’పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Published : 26 Jun 2024 16:04 IST

వాషింగ్టన్‌: నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇందుకోసం అక్కడ వాడీవేడి ప్రచారం కొనసాగుతోంది. ఈ క్రమంలో అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లు ప్రత్యక్ష చర్చకు సిద్ధమయ్యారు. గురువారం (జూన్‌ 27న) జరిగే ఈ ‘డిబేట్‌’ ఎంతో ముఖ్యమైందిగా భావిస్తున్న అమెరికన్లు.. టీవీలు, సోషల్‌ మీడియాల్లో ఈ చర్చను చూసేందుకు సిద్ధమవుతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. దీంతో ఈ కార్యక్రమంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అమెరికా అధ్యక్ష పోరులో ఉన్న డెమొక్రటిక్‌ నేత బైడెన్‌, రిపబ్లికన్‌ నేత ట్రంప్‌.. నాలుగేళ్లలో తొలిసారిగా ముఖాముఖిగా తలపడనున్నారు. దీంతో వారు ఏయే అంశాలపై చర్చించనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూన్‌ 27న అట్లాంటాలోని నెట్వర్క్‌ స్టూడియోస్‌లో 90 నిమిషాల పాటు జరిగే ఈ చర్చను టీవీల్లో లేదా సామాజిక మాధ్యమాల్లో చూడటం లేదా వినేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తాజా సర్వే పేర్కొంది. ఇందుకోసం ప్రణాళిక కూడా వేసుకుంటున్నట్లు ప్రతీ పది మంది అమెరికన్లలో ఆరుగురు భావిస్తున్నట్లు చెప్పింది. కోట్లాది మంది అమెరికన్లు ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోందని అసోసియేటెడ్‌ ప్రెస్‌-ఎన్‌ఓఆర్‌సీ పరిశోధక సంస్థ సంయుక్తంగా చేపట్టిన సర్వే వెల్లడించింది. తమతమ అభ్యర్థిత్వాలను పరీక్షించుకునేందుకు వారికి ఇదొక పరీక్ష అని ఇరువురి మద్దతుదారులు భావిస్తున్నట్లు తెలిసింది.

ఇరువర్గాలకు ముఖ్యమే..

బైడెన్‌ ప్రచారం విజయానికి ఈ చర్చ అత్యంత ముఖ్యమని 47శాతం మంది అమెరికన్లు భావిస్తుండగా.. ట్రంప్‌నకూ ఇదెంతో కీలకమని ప్రతీ పది మందిలో నలుగురు చెబుతున్నారట. ఇది ఇద్దరికీ ఎంతో ముఖ్యమని పదిలో ముగ్గురు భావిస్తున్నారు. అధ్యక్షుడు జో బైడెన్‌కు ఇది మరింత కీలకమని 55శాతం మంది డెమోక్రట్‌లు చెబుతుండగా...51శాతం రిపబ్లికన్లు కూడా ట్రంప్‌పై ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తాజా సర్వే పేర్కొంది. అయితే, వృద్ధాప్యంలో ఉన్న ఈ ఇరువురు నేతలు అభ్యర్థులుగా ఉండటంపైనా ఇరు పార్టీల్లో కొంత అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా పరోక్ష విమర్శలకే పరిమితమైన వీరిద్దరూ ముఖాముఖిగా తలపడనుండడంతో ఆ చర్చ ఏవిధంగా ఉండనుందనే విషయం ఆసక్తి రేపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని