Milk price: పాకిస్థాన్‌లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!

Milk price in pak: పాకిస్థాన్‌లో పాల ధరకు రెక్కలొచ్చాయి. లీటర్‌ పాల ధర ఏకంగా రూ.370కి చేరింది.

Published : 05 Jul 2024 00:08 IST

Milk price | కరాచీ: ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న పాక్‌ పౌరులకు అక్కడి ప్రభుత్వం మరో షాకిచ్చింది. కొత్తగా పాలపై పన్ను విధించింది. దీంతో స్థానికంగా పాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలైన ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా కంటే పాల ధరలు పాక్‌లోనే అధికంగా ఉన్నాయి. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సైతం అక్కడి ప్రజలను బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే.

పాకిస్థాన్‌ పాలపై ఎలాంటి పన్నూ ఉండేది కాదు. అలాంటిది గత వారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్యాకేజ్డ్‌ పాలపై అక్కడి ప్రభుత్వం 18 శాతం పన్ను విధించింది. దీంతో పాల ధరలు 25 శాతం పైగా పెరిగాయి. కొత్తగా పన్ను వేయడంతో కరాచీలో అల్ట్రా హై టెంపరేచర్‌ పాల ధర 370 రూపాయలకు (పాక్‌ కరెన్సీ) చేరింది. డాలర్ల ప్రకారం చూస్తే లీటర్‌ పాల ధర 1.33 డాలర్లుగా ఉంది. పారిస్‌లో లీటర్‌ పాల ధర 1.23 డాలర్లు కాగా.. మెల్‌బోర్న్‌లో 1.08 డాలర్లు మాత్రమే.

పాల ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, వేతనాలు అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో ఖర్చు చేసే సామర్థ్యం మరింత క్షీణించే అవకాశం ఉందని చెబుతున్నారు. పాక్‌లో ఇప్పటికే సుమారు 40 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారని, ముఖ్యంగా పేదరికంలో ఉన్న చిన్నారుల్లో పౌష్టికాహార లోపానికి ఇది దారితీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బెయిలవుట్‌ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) విధించిన షరతులను అందుకోవడంలో భాగంగా పాకిస్థాన్‌ ఇటీవల బడ్జెట్‌లో ఏకంగా 40 శాతం మేర పన్నులు పెంచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని