Larry the Cat: ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!

బ్రిటన్‌ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్‌ స్ట్రీట్‌’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది.

Updated : 06 Jul 2024 15:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రిటన్‌ పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన లేబర్‌ పార్టీ.. 14ఏళ్ల తర్వాత మళ్లీ అధికారం చేపడుతోంది. ఈ క్రమంలో నూతన ప్రధానమంత్రిగా డౌనింగ్‌ స్ట్రీట్‌ (10 Downing Street)లో అడుగుపెడుతున్న కీర్‌ స్టార్మర్‌కు.. ఓ అనూహ్య అతిథి ఆహ్వానం పలికేందుకు సిద్ధమైంది. అదే ల్యారీ అనే పిల్లి (Larry the Cat). డౌనింగ్‌ స్ట్రీట్‌లోకి అయిదుగురు ప్రధానమంత్రులు వచ్చి వెళ్లినా.. 13 ఏళ్లుగా ఆ మార్జాలం మాత్రం అక్కడే మకాం వేయడం గమనార్హం.

బ్రిటన్‌ ప్రధానమంత్రి అధికారిక నివాసమైన ‘నంబర్‌ 10 డౌనింగ్‌ స్ట్రీట్‌’కు ఘన చరిత్ర ఉంది. 1682-84 మధ్య కాలంలో మాజీ దౌత్యవేత్త, ప్రాపర్టీ డెవలపర్‌ జార్జ్‌ డౌనింగ్‌ దీన్ని నిర్మించారు. 1735 నుంచి బ్రిటన్‌ ప్రధానమంత్రి అధికారిక నివాసంగా కొనసాగుతోంది. తదనంతరం పక్కనే ఉన్న నం 11, నం 12 నివాసాలను కూడా దీని కిందకే తీసుకున్నారు. అయితే, పునాదులు గట్టిగా లేకపోవడం, ఎలుకల బెడద వంటి సమస్యలు ఆదినుంచీ వెంటాడుతున్నాయి.

వేటగాడిలా..

ప్రధాని నివాసంలో ఎలుకల బెడద నుంచి బయటపడేందుకు 2011లో (డేవిడ్‌ కామెరూన్‌) బ్యాటర్‌సీ హోం నుంచి ‘ల్యారీ’ అనే పిల్లిని తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆ మార్జాలం.. ‘చీఫ్‌ మౌసర్‌’గా అక్కడే ఉండిపోయింది. మంత్రులు, అధికారులు, మీడియాతో ఆ ప్రాంగణమంతా హడావుడిగా ఉన్నా.. అది మాత్రం దర్జాగా సంచరిస్తుంది. ల్యారీ కోసం సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’లో ప్రత్యేకంగా ఓ ఖాతా కూడా ఉంది. దానికి 8.43లక్షల ఫాలోవర్లు ఉండటం గమనార్హం. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఆ వీధిలోని శునకాలతోపాటు రిషికి చెందిన లాబ్రడార్‌ ‘నోవా’ శునకంతోనూ అది తగువులాడేదని, అందులో ల్యారీదే పైచేయిగా ఉండేదని సునాక్‌ దంపతులే వెల్లడించేవారు.

ల్యారీ హయాంలో ఆరో ప్రధాని..

ల్యారీ ‘10 డౌనింగ్‌ స్ట్రీట్‌’కు వచ్చినప్పటి నుంచి ఐదుగురు ప్రధానమంత్రులు మారడం గమనార్హం. డేవిడ్‌ కామెరూన్‌, థెరెసా మే, బోరిస్‌ జాన్సన్‌, లిజ్‌ ట్రస్‌తోపాటు రిషి సునాక్‌ కూడా అధికారం చేపట్టి నిష్క్రమించినా.. ల్యారీ మాత్రం అక్కడే ఉంది. తాజాగా తన హయాంలో ఆరో ప్రధానిని కీర్‌ స్టార్మన్‌ను డౌనింగ్‌ స్ట్రీట్‌కు ఆహ్వానించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు