Joe Biden: అవును...తడబడ్డాను

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉండగా.. అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య జరిగిన సంవాదం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

Updated : 30 Jun 2024 05:30 IST

అయినా..అమెరికా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించగలను..
ప్రజాస్వామ్యాన్ని రక్షించగలను
ట్రంప్‌తో డిబేట్‌పై విమర్శలకు బైడెన్‌ స్పందన

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉండగా.. అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య జరిగిన సంవాదం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ చర్చ సమయంలో బైడెన్‌ పలుమార్లు తడబాటుకు గురైన తీరు స్వపక్షం డెమోక్రాటిక్‌ పార్టీలో ఆందోళన కలిగిస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళన చాలా మందిలో వ్యక్తమవుతోంది. అయితే, వారు తమ ఆవేదనను బహిరంగపరచకుండా బైడెన్‌ను సమర్థించే యత్నం చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటికిప్పుడు పార్టీ అభ్యర్థిని మార్చడం కష్టం. బైడెన్‌ సహకరిస్తే తప్ప అది సాధ్యం కాదనే అభిప్రాయం డెమోక్రాట్లలో వ్యక్తమవుతోంది. అందుకుగాను పార్టీ నిబంధనలనూ మార్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తనపై వస్తోన్న విమర్శలకు బైడెన్‌ స్పందించారు. ‘‘అవును.. నేను యువకుడిని కాదని నాకు తెలుసు. గతంలో మాదిరిగా చలాకీగా నడవలేను. అప్పటిలా స్పష్టంగా మాట్లాడలేను. మునుపటి మాదిరిగా చర్చించలేకపోవచ్చు. కానీ నిజం ఎలా చెప్పాలో తెలుసు. నా పనిని సక్రమంగా ఎలా చేయాలో తెలుసు. ఎవరైనా కిందపడిపోయినప్పుడు.. తిరిగి మళ్లీ పైకి లేస్తారు. అధ్యక్ష పదవిని నేను నిర్వర్తించగలనని మనస్ఫూర్తిగా నమ్మాను కాబట్టే మళ్లీ పోటీలో ఉన్నా’’ అని శుక్రవారం బదులిచ్చారు. నార్త్‌ కరోలినాలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ..‘డిబేట్‌లో నేను తడబడిన మాట నిజమే. కానీ, అధ్యక్ష బాధ్యతలు ఎలా నిర్వర్తించాలో తెలుసు. ట్రంప్‌ మన ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తారు. నేను దానిని పరిరక్షిస్తాను. ఈ ఒక్క అంశమే ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తుంది’ అని బైడెన్‌ తన పార్టీ వారికి ధైర్యం చెప్పారు. 

మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మద్దతు

అమెరికా మాజీ అధ్యక్షుడు, స్వపక్ష నేత బరాక్‌ ఒబామా...బైడెన్‌కు అండగా నిలిచారు. ‘‘చర్చలు సరిగా జరగని రోజులు ఉంటాయి. సాధారణ ప్రజల కోసం జీవితమంతా పోరాడిన వ్యక్తి(బైడెన్‌)కి, తన గురించి మాత్రమే పట్టించుకునే వ్యక్తి (ట్రంప్‌)కి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకరు నిజం చెప్పే వ్యక్తి- మరొకరు సొంత ప్రయోజనాల కోసం అబద్ధాలు ఆడే వ్యక్తి.. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం కోసం జరుగుతున్న ఎన్నికలివి. ఒక్క డిబేట్‌ దానిని నిర్ణయించలేదు’’ అని బైడెన్‌కు మద్దతుగా నిలిచారు. చర్చలో ట్రంప్‌ పైచేయి సాధించినట్లు సీఎన్‌ఎన్‌ పోల్‌లో మెజారిటీ వీక్షకులు అభిప్రాయపడ్డారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ సైతం బైడెన్‌ చర్చను నెమ్మదిగా ప్రారంభించినట్లు తెలిపారు. కానీ, చివరకు హుందాగా, దీటుగా ముగించారని పేర్కొన్నారు.


డెమోక్రాట్లకు బైడెనే దిక్కు: ట్రంప్‌ 

బైడెన్‌తో జరిగిన ముఖాముఖిలో పైచేయి సాధించడంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. డెమోక్రాట్లకు బైడెన్‌ మించిన ఛాయిస్‌ మరొకటి లేదంటూ ఎద్దేవా చేశారు. అమెరికా చరిత్రలోనే అసమర్థ అధ్యక్షుడిగా బైడెన్‌ నిలిచిపోతారంటూ విమర్శించారు. వర్జీనియాలోని చెసపీక్‌లో శుక్రవారం ట్రంప్‌ తన మద్దతుదారులతో మాట్లాడుతూ..‘90 నిమిషాల డిబేట్‌లో నిలకడగా లేని జో బైడెన్‌ను మళ్లీ నాలుగేళ్లపాటు శ్వేతసౌథంలో కూర్చోబెడితే అమెరికా మనుగడ సాగించగలదా? ఈ అంశాన్ని ప్రతి ఒక్క ఓటరు తమలోతాము ప్రశ్నించుకోవాలి’ అని ట్రంప్‌ అన్నారు. బైడెన్‌ స్థానంలో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిస్తే తానెంతో సంతోషిస్తానని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని