Giorgia Meloni: పని చేసేందుకు వచ్చాం.. చావడానికి కాదు..

ఇటలీలో ఓ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే భారతీయ కార్మికుడి చేయి తెగిపోవడం, అనంతరం సదరు యజమాని అతడిని రోడ్డు పక్కన పడేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Published : 27 Jun 2024 00:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌కు చెందిన ఓ కార్మికుడు దయనీయ స్థితిలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఇటలీలో తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి. వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే కార్మికుడి చేయి తెగిపోవడం, అనంతరం సదరు యజమాని బాధితుడిని రోడ్డు పక్కన పడేసి వెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనను ఇటలీ పార్లమెంటులో ప్రస్తావించిన ప్రధానమంత్రి జార్జియా మెలోని.. బాధితుడి మృతిపై సంతాపం ప్రకటించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదే విషయంలో పార్లమెంటులో మాట్లాడిన ప్రధాని జార్జియా మెలోని.. అమానవీయ చర్యకు సత్నామ్‌ సింగ్‌ బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ చర్యలకు పాల్పడిన వారిని క్రూరులుగా పేర్కొన్న ఆమె.. దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.

వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు అసాంజేకు విముక్తి

మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ ఇటలీలో పనిచేస్తున్న వేల మంది కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఇటలీలో ఈ తరహా ‘బానిసత్వం’ అంతం కావాలంటూ ప్రదర్శనలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తోన్న వాళ్లను శునకాల మాదిరిగా చూస్తున్నారని, తమపై శ్రమ దోపిడీ జరుగుతూనే ఉందని గుర్‌ముఖ్‌ సింగ్‌ అనే భారతీయుడు పేర్కొన్నాడు. ఇక్కడకు పనిచేయడానికే వచ్చామని, చావడానికి కాదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇటలీ వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేందుకు పలు దేశాల నుంచి వేలాది మంది అక్రమంగా చేరుకుంటుంటారు. ఇలా భారత్‌ నుంచి అధికారిక అనుమతులు లేకుండా ఇటలీకి వెళ్లిన పంజాబ్‌ వాసి సత్నామ్‌ సింగ్‌(31).. అక్కడ ఓ వ్యవసాయ క్షేత్రంలో పని చేసేవాడు. అక్కడ ఎండుగడ్డిని కత్తిరిస్తున్న సమయంలో చేయి తెగింది. అతడిని ఆసుపత్రికి తరలించాల్సిన సిబ్బంది.. ఒక చెత్త బస్తాలో ఉంచి రోడ్డుపై పడేశారు. బాధితుడి భార్య, స్నేహితులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో స్పందించిన అధికారులు.. తీవ్రగాయాలతో ఉన్న అతడిని ఎయిర్‌ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న అతడు ఇటీవల ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై ఇటలీలోని భారత రాయబార కార్యాలయం ఇటీవల స్పందిస్తూ.. ఆ కుటుంబానికి సహకరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు