Iran: ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికలో ప్రతిష్టంభన

తక్కువ పోలింగ్‌ శాతం కారణంగా ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికలో ప్రతిష్టంభన నెలకొంది. శుక్రవారం నాటి పోలింగులో దాదాపు 60% మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోకపోవడంతో జులై 5న రెండో బ్యాలెట్‌ (రన్‌ఆఫ్‌ పోలింగ్‌)ను నిర్వహించబోతున్నారు.

Updated : 30 Jun 2024 05:24 IST

తక్కువ ఓట్ల నమోదుతో తేలని ఫలితం 

దుబాయ్‌: తక్కువ పోలింగ్‌ శాతం కారణంగా ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికలో ప్రతిష్టంభన నెలకొంది. శుక్రవారం నాటి పోలింగులో దాదాపు 60% మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోకపోవడంతో జులై 5న రెండో బ్యాలెట్‌ (రన్‌ఆఫ్‌ పోలింగ్‌)ను నిర్వహించబోతున్నారు. సంస్కరణవాదిగా గుర్తింపుపొందిన మసౌద్‌ పెజెష్కియన్, పిడివాది సయీద్‌ జలిలి ఈ పదవి కోసం పోటీలో ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఇరాన్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఈసారి ఓటింగుకు మొహం చాటేశారు. ఇద్దరు అభ్యర్థులను, వ్యవస్థను తిరస్కరించడానికే వారు ఇలా చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2.45 కోట్ల మంది ఓటర్లలో పెజెష్కియన్‌కు 1.04 కోట్ల మంది, జలిలికి 94 లక్షల మంది అనుకూలంగా ఓటు వేశారు. బరిలో ఉన్న ఇతరుల్లో ఒకరికి 33 లక్షలు, మరొకరికి 2.06 లక్షల ఓట్లు పడ్డాయి. 10 లక్షలకు పైగా ఓట్లు చెల్లలేదు. పోలైన ఓట్లలో 50% పైగా వచ్చినవారే విజేత అవుతారని ఇరాన్‌ చట్టాలు చెబుతున్నాయి. అలా రానప్పుడు.. అగ్రస్థానంలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల మధ్య వారం రోజుల తర్వాత రన్‌ఆఫ్‌ పోలింగ్‌ నిర్వహించాలి. ఇలా 2005లో ఒకేఒక్కసారి జరిగింది. 2021లో ఇరాన్‌ అధ్యక్షునిగా ఇబ్రహీం రైసీ ఎన్నికైనప్పుడు 48.8% పోలింగ్‌ నమోదుకాగా ఈసారి 39.9 శాతానికి పడిపోయింది. మే 19 నాటి హెలికాప్టర్‌ ప్రమాదంలో రైసీ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని