USA: ముఖంపై కొట్టి.. అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య

USA: అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యారు. ముఖంపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలతో ఆయన మృతి చెందారు.

Published : 26 Jun 2024 12:07 IST

ఓక్లహామా: అగ్రరాజ్యం అమెరికా (USA)లో ఇటీవల భారతీయులు, భారత సంతతి వ్యక్తులు వరుసగా దాడులకు గురవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరో భారత సంతతి వ్యక్తి (Indian American Man)పై దాడి జరిగింది. ఓ దుండగుడు ముఖంపై బలంగా కొట్టడంతో ఆయన మృతి చెందారు.

ఓక్లహామాలో జూన్‌ 22న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడిని హేమంత్‌ మిస్త్రీగా గుర్తించారు. గుజరాత్‌కు చెందిన 59 ఏళ్ల మిస్త్రీ కొన్నేళ్లక్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఓక్లహామాలో ఓ మోటెల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

అమెరికాలో కాల్పులు.. ఐదుగురి మృతి.. దుండగుడి ఆత్మహత్య!

గత శనివారం ఈ మోటెల్‌కు రిచర్డ్‌ లూయిస్‌ అనే వ్యక్తి వచ్చాడు. ఏదో విషయం కారణంగా వీరి మధ్య గొడవ జరగడంతో ఇక్కడినుంచి వెళ్లిపోవాలని మిస్త్రీ గట్టిగా చెప్పాడు. దీంతో ఆవేశానికి గురైన రిచర్డ్‌ ఆయన ముఖంపై బలంగా కొట్టాడు. ఈ దాడితో అక్కడికక్కడే కుప్పకూలిన మిస్త్రీని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరుసటిరోజు ఆయన ప్రాణాలు కోల్పోయారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. వారి మధ్య గొడవకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఇటీవల డాలస్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాసరి గోపీకృష్ణ (32)పై ఓ దుండగుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడు స్టోర్‌లో దొంగతనానికి వచ్చాడని.. గోపీకృష్ణ విధుల్లో ఉండటంతో కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు