Hurricane Beryl: బెంబేలెత్తించిన బెరిల్‌.. మొత్తం ద్వీపం ధ్వంసం!

Hurricane Beryl: బెరిల్‌ హరికేన్‌ కరీబియన్‌ దీవుల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. సెయింట్ విన్సెంట్‌, గ్రెనడైన్స్‌లోని ‘యూనియన్ ఐలాండ్‌’ (Union Island) దాదాపు పూర్తిగా ధ్వంసమైంది.

Updated : 03 Jul 2024 14:39 IST

క్లిఫ్టన్‌: కరీబియన్‌ దీవుల్లో భీకర ‘బెరిల్‌’ హరికేన్‌ (Hurricane Beryl) భారీ విధ్వంసమే సృష్టించింది. దాదాపు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు అనేక దీవుల్లో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీశాయి. 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఐవాన్‌’ తర్వాత.. అంతటి భారీ హరికేన్‌ ఇదేనని స్థానిక అధికారిక యంత్రాంగం వెల్లడించింది. సెయింట్ విన్సెంట్‌, గ్రెనడైన్స్‌లోని ‘యూనియన్ ఐలాండ్‌’ (Union Island) దాదాపు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 90 శాతం ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఉన్న ఒక్క విమానాశ్రయం పైకప్పు మొత్తం ఎగిరిపోయిందని స్వయంగా ప్రధానమంత్రి రాల్ఫ్ గోన్సాల్వ్స్ వెల్లడించారు.

కరీబియన్‌ దీవుల్లో ఒకటైన యూనియన్‌ ఐలాండ్‌ (Union Island) పొడవులో మూడు మైళ్లు, వెడల్పులో ఒక మైలు విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ దాదాపు 3,000 నివాసాలు ఉన్నాయి. బెరిల్‌ సృష్టించిన విధ్వంసంలో విలవిల్లాడిన ఈ దీవి ఇప్పుడు దాదాపు కనుమరుగైన పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోయారు. ఇప్పటివరకు ఈ దీవిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పక్కనే ఉన్న బెఖియా దీవిలోనూ తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. తాగునీరు, విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు రాల్ఫ్‌ వెల్లడించారు. పునరుద్ధరణకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందన్నారు.

యూనియన్‌ ఐలాండ్‌ (Union Island) పునర్‌నిర్మాణానికి బిలియన్ల డాలర్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. దాదాపు ఏడాది కాలం పట్టొచ్చని తెలిపారు. వెంటనే తగిన చర్యలు చేపడతామని రాల్ఫ్‌ హామీ ఇచ్చారు. ప్రభుత్వం దగ్గర అందుకు సరిపడా నిధులు ఉన్నాయా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాము తీవ్ర సంక్షోభంలో ఉన్నామని.. ఆపన్నహస్తం అందించాలని కరీబియన్‌కు చెందిన ప్రవాసులను యూనియన్‌ ఐలాండ్‌ పర్యావరణ కూటమి డైరెక్టర్‌ కత్రినాకాయ్‌ విజ్ఞప్తి చేశారు. ఎమర్జెన్సీ కిట్లు, ఆహారం, పునరావాస సౌకర్యాలు అత్యవసరంగా కావాల్సి ఉందని తెలిపారు. తాగునీటి కోసం తాము ఏళ్లుగా చేసిన కృషి మొత్తం బెరిల్‌ తుడిచిపెట్టేసిందని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

ఆగ్నేయ కరేబియన్‌ ప్రాంతం సమీపంలో ఏర్పడిన బెరిల్‌ హరికేన్‌ (Hurricane Beryl) సోమవారం తీవ్రరూపం దాల్చింది. బార్బడోస్, సెయింట్‌ లూసియా, గ్రెనడా, సెయింట్‌ విన్సెంట్, గ్రెనడైన్‌ దీవులను కుదిపేసింది. ప్రస్తుతం దీని తీవ్రత కేటగిరీ-4కు తగ్గిందని నేషనల్‌ హరికేన్‌ కేంద్రం తెలిపింది. జమైకా దిశగా సాగుతున్నట్లు వెల్లడించింది.

బయలుదేరిన టీమ్‌ఇండియా.. 

టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన టీమ్‌ఇండియా ఆటగాళ్లు స్వదేశానికి చేరుకోనున్నారు. బెరిల్‌ హరికేన్‌ కారణంగా ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో రోహిత్‌శర్మ సేన, సహాయక సిబ్బంది, బీసీసీఐ అధికారులు, ఆటగాళ్ల కుటుంబసభ్యులు రెండ్రోజులుగా బార్బడోస్‌లోనే ఉన్నారు. వాతావరణం మెరుగవడంతో అక్కడున్నవాళ్లంతా ప్రత్యేక విమానంలో బార్బడోస్‌ నుంచి బుధవారం బయల్దేరారు. గురువారం ఉదయం విమానం దిల్లీ చేరుకోనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఆటగాళ్లందరూ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు