బైడెన్‌ వైదొలగేదే లేదు

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ వైదొలగే ప్రసక్తే లేదని శ్వేతసౌధం స్పష్టంచేసింది. తన ప్రత్యర్థి, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ముఖాముఖిలో బైడెన్‌ తడబడడం అనేక సందేహాలకు తావిచ్చిన..

Published : 05 Jul 2024 06:15 IST

తేల్చిచెప్పిన శ్వేతసౌధం 
పోటీలో ఉండేది ఆయనేనని స్పష్టీకరణ 

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల బరి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ వైదొలగే ప్రసక్తే లేదని శ్వేతసౌధం స్పష్టంచేసింది. తన ప్రత్యర్థి, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ముఖాముఖిలో బైడెన్‌ తడబడడం అనేక సందేహాలకు తావిచ్చిన నేపథ్యంలో అధ్యక్ష కార్యాలయం మీడియా కార్యదర్శి కరీన్‌ జీన్‌ పియర్‌ ఈ విషయాన్ని తేల్చిచెప్పారు. బైడెన్‌ తప్పుకొనే ప్రశ్నే తలెత్తదన్నారు. బరిలో ఉంటున్న విషయాన్ని తాజా ప్రచారంలోనూ ఆయన స్పష్టంచేశారని కరీన్‌ గుర్తుచేశారు. ప్రచారాన్ని నిలిపివేసి రాజీనామా చేసే ఉద్దేశమేదీ ఆయనకు లేదని, బాధ్యతల్ని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు అప్పగించే చర్చలేమీ జరగలేదని ఖండించారు. బైడెన్‌ అత్యంత గడ్డుకాలం ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆందోళనలు వ్యక్తమవడం సహజమే అయినప్పటికీ.. ఆయన నాలుగేళ్ల పనితీరును దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఆయన సేవలను మరవొద్దని, మరో నాలుగేళ్ల పాటు బైడెన్‌ సమర్థంగా పనిచేయగలరని భావిస్తున్నామని చెప్పారు. ఆయనకున్న పాలనానుభవం మరెవరికీ లేదని, బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఆయన ఇంకా పని చేయాలనుకుంటున్నారని పేర్కొన్నారు. జలుబు, ప్రయాణ అలసటవల్ల ఆయన డస్సిపోయినా నిరంతరం ప్రజల కోసమే ఆలోచిస్తున్నాంటారని చెప్పారు. పనిచేయడంపైనే ఆయన దృష్టి ఉందని, బయట వ్యాప్తిలో ఉన్నవన్నీ వదంతులేనని స్పష్టీకరించారు. 

చాలాసార్లు కిందపడ్డా పైకి లేచాను: బైడెన్‌ 

‘‘డెమోక్రటిక్‌ పార్టీ నామినీని నేనే. తుదివరకు పోరాడతా. మనమే గెలవబోతున్నాం. ట్రంప్‌ను ఓడించేందుకు మాకు అండగా నిలవండి’’ అని మద్దతుదారులకు పంపిన ఈ-మెయిల్‌లో బైడెన్‌ పిలుపునిచ్చారు. ‘‘జీవితంలో నేను చాలాసార్లు కింద పడ్డాను. పైకి లేచి పోరాడాను. ఎన్నిసార్లు పడిపోయావన్నది కాదు.. ఎంత వేగంగా కోలుకున్నావనేదే ముఖ్యమని మా నాన్న చెబుతుండేవారు. అమెరికా సైతం వెనకబడిన ప్రతిసారీ బలంగా పుంజుకొని తానేంటో నిరూపించుకుంది. నేనూ అదే చేయబోతున్నాను. 2020 మాదిరిగానే కమలాహారిస్‌తో కలిసి ట్రంప్‌ను నేనిప్పుడు ఓడించబోతున్నాను. అది అంత సులభం కాదు. దానికి మీ మద్దతు కావాలి’’ అని బైడెన్‌ రాసుకొచ్చారు.


బైడెన్‌ కంటే ట్రంప్‌నకే ఎక్కువ మద్దతు!

బైడెన్‌ కంటే ట్రంప్‌ దాదాపు 6 శాతం ఎక్కువగా మద్దతు పొందుతున్నారని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తాజా సర్వే అంచనా వేసింది. వృద్ధాప్యం రీత్యా మరోసారి పగ్గాలు చేపట్టడం బైడెన్‌కు కష్టమేనని ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు తెలిపింది. కమలా హారిస్‌కు అంతగా ఆదరణ లేదంది. బైడెన్‌ తన తొలివిడత పదవీకాలాన్నే పూర్తిచేసేలా లేరని, ఆయనకు ఓటు వేయడమంటే హారిస్‌ను ఎన్నుకున్నట్లేనని ఓ ప్రముఖ విలేకరి ప్రశ్నించడంపై భారతీయ అమెరికన్‌ రాజకీయవేత్త నిక్కీ హేలీ అభ్యంతరం తెలిపారు. ఏ ప్రాతిపదికన అలా అంటున్నారని తిరిగి ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని