Japan: బలవంతంగా సంతానశక్తి తొలగింపు.. తగిన పరిహారం చెల్లింపునకు కోర్టు ఆదేశం

జపాన్‌లో దాదాపు డజను మంది బాధితులకు బలవంతంగా సంతానశక్తి తొలగించినందుకుగాను తగిన పరిహారం చెల్లించవలసిందిగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం బుధవారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది.

Updated : 05 Jul 2024 06:58 IST

బాధితులను క్షమాపణ కోరిన జపాన్‌ ప్రధాని కిషిద

టోక్యో: జపాన్‌లో దాదాపు డజను మంది బాధితులకు బలవంతంగా సంతానశక్తి తొలగించినందుకుగాను తగిన పరిహారం చెల్లించవలసిందిగా దేశంలోని అత్యున్నత న్యాయస్థానం బుధవారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది. వైకల్యమున్న వ్యక్తుల్లో సంతాన నిరోధానికిగాను రూపొందించిన యూజెనిక్స్‌ రక్షణ చట్టం కింద ఈ ‘స్టెరిలైజేషను’ చేశారు. ఇలా 1950 నుంచి 1970 మధ్య దాదాపు 25,000 మందికి వారి అనుమతితో పని లేకుండా సంతాన నిరోధక చికిత్సలు నిర్వహించారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత జపాన్‌లో జరిగిన అతిపెద్ద మానవహక్కుల ఉల్లంఘనగా దీన్ని బాధితుల తరఫు న్యాయవాదులు అభివర్ణించారు. 1948 నాటి ఈ యూజెనిక్స్‌ చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న కోర్టు ప్రభుత్వ వాదనను తిరస్కరించింది. సర్కారు ఆధ్వర్యంలో దశాబ్దాల తరబడి వివక్ష, మానవహక్కుల ఉల్లంఘన కొనసాగడం చాలా తీవ్రమైన విషయంగా పేర్కొంది. ఫిర్యాదుదారుల్లో కొందరు దిగువస్థాయిలో అయిదు కోర్టుల దాకా పోరాడి సుప్రీంకోర్టుకు వచ్చారు. వీల్‌ఛైర్లలో కోర్టుకు వచ్చిన కొందరు బాధితులు న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కిందిస్థాయి కోర్టుల తీర్పు మేరకు ఒక్కో బాధితుడికి 3.2 మిలియన్ల యెన్‌లు (16.5 లక్షలు) పరిహారంగా ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధత తెలుపగా, ఇది సంతృప్తికరమైన మొత్తం కాదని బుధవారం సుప్రీంకోర్టు తెలిపింది. బాధితులను క్షమాపణ కోరిన జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిద.. వారిని వ్యక్తిగతంగా కలుసుకునేందుకు ప్రయత్నిస్తానని, అలాగే కొత్త పరిహార పథకాన్ని ప్రభుత్వం తీసుకువస్తుందని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని