భారతీయ విద్యార్థుల మద్దతుకు అమెరికాలో ప్రత్యేక ‘పోర్టల్‌’ వేదిక

అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థుల సహాయార్థం న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక వేదికను రూపొందించింది. విద్యార్థులకు అమెరికన్‌ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు వెదకటంతోపాటు న్యాయ, వైద్యపరమైన సమచారం ఈ వేదిక ద్వారా వారికి అందుబాటులో ఉంచుతారు.

Published : 04 Jul 2024 06:11 IST

న్యూయార్క్‌ దౌత్య కార్యాలయం వెల్లడి

న్యూయార్క్‌: అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థుల సహాయార్థం న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక వేదికను రూపొందించింది. విద్యార్థులకు అమెరికన్‌ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు వెదకటంతోపాటు న్యాయ, వైద్యపరమైన సమచారం ఈ వేదిక ద్వారా వారికి అందుబాటులో ఉంచుతారు. న్యూయార్క్‌లోని ఈ దౌత్య కార్యాలయం ఈశాన్య అమెరికా రాష్ట్రాలైన కనెక్టికట్, మైన్, మసాచ్యుసెట్స్, న్యూ హ్యాంప్‌షైర్, న్యూజెర్సీ, న్యూయార్క్, ఒహాయో, పెన్సిల్వేనియా, రోడ్‌ ఐలాండ్, వర్మాంట్‌ల పరిధిలో సేవలు అందిస్తుంది. ‘‘భారతీయ విద్యార్థులకు మా పరిధిలో తగిన సహకారం అందించాలన్న దౌత్య కార్యాలయ ప్రయత్నాల్లో భాగంగా ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాం. అర్హులైన భారత విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు ఇచ్చేందుకు పలు ఇండియన్, అమెరికన్‌ కంపెనీలు.. సంస్థలు తమ అంగీకారం తెలిపాయి. మేము పోర్టల్‌లో ఇచ్చే సమాచారం మేరకు విద్యార్థులు నేరుగా ఆయా కంపెనీలకు దరఖాస్తు చేసుకోవచ్చు’’ అని దౌత్య కార్యాలయం ‘ఎక్స్‌’ ద్వారా తెలిపింది. 

అలాగే ఇబ్బందుల్లో ఉన్న భారతీయులకు సహాయం చేసేందుకు కొందరు ప్రముఖ న్యాయవాదులు అంగీకరించారని, ఆయా కేసుల పరిణామాలతో కాన్సులేట్‌కు ఎటువంటి సంబంధం ఉండదని స్పష్టం చేసింది. ‘‘మా పరిధిలో ఉన్న పది రాష్ట్రాల్లోని భారతీయ విద్యార్థులకు మానసిక చికిత్స తదితర కౌన్సెలింగులు (అవసరమైతే టెలీమెడిసన్‌ ద్వారా) అందించేందుకు కొందరు వైద్యులు సైతం తమ సంసిద్ధత తెలిపారు’’ అని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని