సంక్షిప్త వార్తలు

నేను రోజూ త్వరగా నిద్రపోతాను. త్వరగా నిద్రలేస్తాను. ఉదయం వార్తాపత్రిక చదవడమంటే ఇష్టం. కాఫీని ఆస్వాదిస్తా. నా పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి ముందే వారితో కలిసి అల్పాహారం తీసుకుంటా.

Updated : 03 Jul 2024 05:25 IST

వార్తాపత్రిక చదవడం ఇష్టం 

నేను రోజూ త్వరగా నిద్రపోతాను. త్వరగా నిద్రలేస్తాను. ఉదయం వార్తాపత్రిక చదవడమంటే ఇష్టం. కాఫీని ఆస్వాదిస్తా. నా పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి ముందే వారితో కలిసి అల్పాహారం తీసుకుంటా. ఈ పనులన్నీ నాకు చాలా ముఖ్యం. అవన్నీ పూర్తయ్యాక- రోజులో నా తొలి సమావేశాన్ని 10 గంటలకల్లా ప్రారంభిస్తా. ముఖ్యమైన భేటీలన్నీ మధ్యాహ్న భోజనానికి ముందే పూర్తయ్యేలా చూసుకుంటా. 

జెఫ్‌ బెజోస్, అమెజాన్‌ వ్యవస్థాపకుడు


పెద్దయ్యేకొద్దీ సమయం ఖరీదైనదిగా మారుతుంది! 

16-25 ఏళ్ల మధ్య వయసువారికి నాదొక సలహా. మీ శరీరాకృతిని తీర్చిదిద్దు కోవడంపై బాగా దృష్టిపెట్టండి. అందుకు మీకిప్పుడు అవసరమయ్యేది సమయం మాత్రమే. డబ్బు పెద్దగా అక్కర్లేదు. వయసు పెరిగేకొద్దీ సమయం అత్యంత ఖరీదైనదిగా మారుతుంది. కాబట్టి అది సులభంగా అందుబాటులో ఉండి.. మీపై బాధ్యతలు ఎక్కువగా లేని కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. 

అలెక్స్‌ హార్మోజీ, పెట్టుబడిదారుడు


బైడెన్‌ కొనసాగడం కష్టమే!

బైడెన్‌ ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగడం కష్టమే అనిపిస్తోంది. ట్రంప్‌తో సంవాదంలో తడబడినప్పటికీ.. ఆయనకు మద్దతిస్తూ బరాక్‌ ఒబామా ఇటీవల ట్వీట్‌ చేసిన మాట వాస్తవమే. కానీ ఒబామాకు కూడా బైడెన్‌ గెలుస్తారన్న నమ్మకం లేదు. తన అంతరంగికులతో ఆయన ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. గ్రెచెన్‌ వైట్‌మర్‌ వంటి భవిష్యత్తు తరం డెమోక్రాటిక్‌ నేతలు ఈ పరిస్థితిని తమకు మంచి అవకాశంగా భావిస్తున్నారు. బైడెన్‌ వైదొలగాలంటూ దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. 

టకర్‌ కార్ల్‌సన్, అమెరికా రాజకీయ వ్యవహారాల నిపుణుడు


పనికి తగ్గట్లు విద్యార్థులను తీర్చిదిద్దట్లేదు

పీహెచ్‌డీ చేసినవారు బంట్రోతు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడం, సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివినవారు ఫుడ్‌ డెలివరీ ఏజెంట్లుగా పనిచేయడం వంటివి భారత్‌లో మామూలు విషయాలే. ఇక్కడ విద్యతో ఇబ్బంది లేదు. పనికి అవసరమైనట్టు విద్యార్థులను తీర్చిదిద్దకపోవడమే అసలు సమస్య. మన దేశంలో లక్షల మంది ఇంజినీరింగ్‌ పట్టభద్రులున్నా.. తమ సంస్థలో పనిచేసేందుకు చైనా ఉద్యోగులకు వీసాలివ్వాలంటూ అదానీ గ్రూప్‌ ఇటీవల దరఖాస్తు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 

అక్షత్‌ శ్రీవాస్తవ, మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌  


సరికొత్త క్షిపణిని పరీక్షించాం: ఉత్తర కొరియా 

సియోల్‌: భారీ వార్‌హెడ్‌ను మోసుకెళ్లగల సరికొత్త బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించినట్లు ఉత్తర కొరియా మంగళవారం ప్రకటించింది. దక్షిణ కొరియా అధికారులు, నిపుణులు మాత్రం దీన్ని ఖండించారు. హ్వాసాంగ్‌పో-11 డీఏ-4.5 క్షిపణిని పరీక్షించినట్లు ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్‌ఏ తెలిపింది. ఇది 4.5 టన్నుల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదని పేర్కొంది. ఈ అస్త్రం.. గరిష్ఠంగా 500 కిలోమీటర్లు, కనిష్ఠంగా 90 కిలోమీటర్లు దూరం ప్రయాణించగలదని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని