ఖాన్‌ యూనిస్‌లో విధ్వంసం

దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ నగరం మరోసారి బాంబులతో దద్దరిల్లింది. హమాస్‌ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సేనలు మెరుపు దాడికి దిగాయి.

Published : 03 Jul 2024 05:13 IST

అప్పుడే హెచ్చరికలు.. అంతలోనే బాంబుల మోత..
9 మంది దుర్మరణం

ఖాన్‌ యూనిస్‌: దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ నగరం మరోసారి బాంబులతో దద్దరిల్లింది. హమాస్‌ మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ సేనలు మెరుపు దాడికి దిగాయి. స్థానిక ప్రజలంతా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించిన గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌ రక్షణ దళం (ఐడీఎఫ్‌) బాంబుల మోత మోగించింది. ఈ దాడుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. 50 మందికిపైగా ప్రజలకు గాయాలైనట్లు పేర్కొన్నారు. ఖాన్‌ యూనిస్‌ నగరాన్ని ఖాళీ చేయాలంటూ స్థానిక పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌ సోమవారమే ఆదేశించింది. అంతలోనే దాడులకు పాల్పడటం గమనార్హం. ఖాన్‌ యూనిస్‌ నుంచి ఇజ్రాయెల్‌ సరిహద్దు ప్రాంతాలపై హమాస్‌ ఉగ్రవాదులు రాకెట్లతో దాడులకు దిగారని, అందుకే ప్రతిదాడులు చేయాల్సి వచ్చిందని ఐడీఎఫ్‌ సమర్థించుకుంటోంది. ఖాన్‌ యూనిస్‌లోని నిస్సార్‌ ఆసుపత్రిలో ఉగ్రవాదులు ఉన్నారని పసిగట్టిన ఇజ్రాయెల్‌ సేనలు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అక్కడికి చేరుకున్నాయి. ఖాళీ చేయాలని ముందే హెచ్చరించినందున కాల్పులకు దిగాయి. అప్పటికే చాలా వరకు రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఈ ప్రక్రియ చివరి దశలో ఉండగానే సైన్యం బాంబు దాడులు చేసిందని నిస్సార్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ తెలిపారు. దీనివల్లే 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మరోవైపు అక్కడికి దగ్గర్లోని యూరోపియన్‌ ఆసుపత్రి చుట్టుపక్కల భవనాలపైనా ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేసింది. ఆ భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. అయితే ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్న దానిపై స్పష్టత లేదు.

గాజాలో కాల్పుల విరమణ అమలైతే దాడులు ఆపుతాం: హెజ్‌బొల్లా

బీరుట్‌: గాజాలో కాల్పుల విరమణ అమలైతే ఇజ్రాయెల్‌పై దాడులను ఆపేస్తామని హెజ్‌బొల్లా ఉప నేత షేక్‌ నయమ్‌ కస్సెం స్పష్టం చేశాడు. హమాస్‌కు మద్దతుగానే తాము యుద్ధం చేస్తున్నామని తెలిపాడు. బీరుట్‌లో ఓ వార్తా సంస్థకు అతడు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అధికారిక ఒప్పందం లేకుండా ఇజ్రాయెల్‌ సేనలు గాజా నుంచి వెనక్కి తగ్గినా తమ దాడుల్లో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని