ఫ్రాన్స్‌లో మెక్రాన్‌కు ఎదురుదెబ్బ!

ఫ్రాన్స్‌ పార్లమెంటు ఎన్నికల తొలి విడత ఓటింగ్‌లో అతి జాతీయవాద నేషనల్‌ ర్యాలీ పార్టీ ఆధిక్యం సాధించినట్లు సోమవారం విడుదలైన ఫలితాలు సూచిస్తున్నాయి.

Published : 02 Jul 2024 05:34 IST

 

తొలి విడత ఓటింగ్‌లో నేషనల్‌ ర్యాలీ పార్టీ ఆధిక్యం 

పారిస్‌: ఫ్రాన్స్‌ పార్లమెంటు ఎన్నికల తొలి విడత ఓటింగ్‌లో అతి జాతీయవాద నేషనల్‌ ర్యాలీ పార్టీ ఆధిక్యం సాధించినట్లు సోమవారం విడుదలైన ఫలితాలు సూచిస్తున్నాయి. ఆదివారం జరిగే తుదివిడత పోలింగ్‌లోనూ ఆ పార్టీ ఆధిక్యం సాధిస్తే పార్లమెంటులో స్పష్టమైన మెజారిటీ పొందగలుగుతుంది. తద్వారా రెండో ప్రపంచ యుద్ధం తరవాత ఫ్రాన్స్‌లో అతి జాతీయవాద పార్టీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. తొలివిడతలో 33 శాతం ఓట్లను మరీన్‌ లే పెన్‌ నాయకత్వంలోని నేషనల్‌ ర్యాలీ పార్టీయే దక్కించుకుంది. వామపక్ష కూటమి అయిన న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ 28 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలవగా, దేశాధ్యక్షుడు మెక్రాన్‌ నాయకత్వంలోని మధ్యేవాద కూటమి 20 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. ఫ్రాన్స్‌ నుంచి యూరోపియన్‌ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో నేషనల్‌ ర్యాలీ చేతిలో మెక్రాన్‌ పార్టీ ఓడిపోవడంతో పార్లమెంటు మధ్యంతర ఎన్నికలకు ఆయన ఆదేశం జారీచేశారు. నేషనల్‌ ర్యాలీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయకుండా అడ్డుకోవడానికి వామపక్ష కూటమి.. మెక్రాన్‌ మధ్యేవాద కూటమితో చేతులు కలపడానికి సిద్ధంగా ఉంది. ఆదివారంనాటి తొలివిడత పోలింగ్‌లో 577 పార్లమెంటు సీట్లకు గానూ 78 సీట్లను 50 శాతానికి పైగా ఓట్లు సాధించినవారు గెలుచుకున్నారు. వీటిలో 38 సీట్లను నేషనల్‌ ర్యాలీ అభ్యర్థులే దక్కించుకున్నారు. విజేతల్లో మరీన్‌ లే పెన్‌ కూడా ఉన్నారు. నేషనల్‌ ర్యాలీ పార్టీ ఫ్రాన్స్‌లోని ముస్లిం వర్గాన్ని వ్యతిరేకిస్తోంది. రష్యాను సమర్థిస్తూ ఉక్రెయిన్‌కు ఫ్రెంచి దూరశ్రేణి క్షిపణుల సరఫరానూ నిలిపేస్తానంటోంది. మెక్రాన్‌ స్వదేశీ, విదేశీ విధానాలను గట్టిగా వ్యతిరేకిస్తోంది. నేషనల్‌ ర్యాలీ పార్టీ వంటి శక్తుల చేతికి అధికారం వస్తే ఫ్రాన్స్‌లో అంతర్యుద్ధం సంభవిస్తుందని మెక్రాన్‌ హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని