ఆస్ట్రేలియా చదువులు మరింత భారం

అంతర్జాతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియాలో చదువులు మరింత భారంగా మారనున్నాయి. ఇతర దేశాల నుంచి అక్కడికి వెళ్లి చదువుకొనే విద్యార్థుల వీసా రుసుములను ఆ దేశం భారీగా పెంచేసింది.

Published : 02 Jul 2024 05:32 IST

విద్యార్థి వీసా రుసుములు 100 శాతానికిపైగా పెంపు
భారతీయులపైనా తీవ్ర ప్రభావం

మెల్‌బోర్న్‌: అంతర్జాతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియాలో చదువులు మరింత భారంగా మారనున్నాయి. ఇతర దేశాల నుంచి అక్కడికి వెళ్లి చదువుకొనే విద్యార్థుల వీసా రుసుములను ఆ దేశం భారీగా పెంచేసింది. గతంలో 710 అమెరికన్‌ డాలర్లు (రూ.59,260)గా ఉన్న రుసుమును ఇప్పుడు 1,600 డాలర్ల(1,35,55)కు పెంచింది. సోమవారం (జులై 1) నుంచి ఇది అమల్లోకి వచ్చింది. టెంపరరీ గ్రాడ్యుయేట్, విజిటర్, మారిటైమ్‌ క్రూ వీసాలతో ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా విద్యార్థి వీసాకు దరఖాస్తు చేయడానికి అనర్హులు. ప్రస్తుతం ఆ దేశంలో నివాసం ఉంటున్న వేల మంది భారతీయులపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. ‘మా అంతర్జాతీయ విద్యావిధానం మరింత బలంగా మారేందుకు వీలుగా వీసా రుసుముల పెంపు నిర్ణయం తీసుకొన్నాం’ అని ఆ దేశ హోం సెక్రటరీ తెలిపారు. ఆస్ట్రేలియాలో కేవలం అసలైన విద్యార్థులు వీసాలు పొందేలా, దేశ ఆర్థిక వ్యవస్థకు అది ఊతమిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. వ్యవస్థలో ఉన్న లోపాలను వాడుకొంటూ విదేశీ విద్యార్థులు అక్కడే ఉండిపోవడాన్ని ఇది నిరోధిస్తుంది. ఆ దేశ గణాంకాల శాఖ లెక్కల ప్రకారం... 2023 సెప్టెంబరు 30తో ముగిసిన ఏడాది కాలంలో 5,48,000 మంది అక్కడకు వలస వచ్చారు. భారత్‌ నుంచి ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాల్లో ఒక్క 2022 సంవత్సరంలోనే 1,00,009 మంది నమోదయ్యారు. 2023లో జనవరి నుంచి సెప్టెంబరు వరకు 1.22 లక్షల మంది విద్యార్థులు నమోదయ్యారు. అంతర్జాతీయ విద్యార్థి వీసాల రసుములతో పాటు డిపాజిట్‌ చేయాల్సిన మొత్తాలను పెంచడం వల్ల ఆస్ట్రేలియాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోతుందనే ఆందోళన స్థానికంగా వ్యక్తమవుతోంది. రుసుములను భారీగా పెంచడం వల్ల ఆస్ట్రేలియా విద్యారంగం ఏడాదికి 4800 కోట్ల అమెరికన్‌ డాలర్ల (సుమారు రూ.4లక్షల కోట్ల)ను నష్టపోయే పరిస్థితి వస్తోందని ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా సీఈవో ఫిల్‌ హానీవుడ్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని