సుప్రీంకోర్టులో ట్రంప్‌నకు ఉపశమనం

అధ్యక్ష ఎన్నికల్లో(2020) ప్రజాతీర్పును మార్చివేసేందుకు యత్నించారనే అభియోగాలను ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.

Published : 02 Jul 2024 05:35 IST

మాజీ అధ్యక్షులకూ విచారణల నుంచి మినహాయింపు
చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికల్లో(2020) ప్రజాతీర్పును మార్చివేసేందుకు యత్నించారనే అభియోగాలను ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. నేరాభియోగాల విచారణల నుంచి మాజీ అధ్యక్షులకూ మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు సోమవారం చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును 9 మందితో కూడిన ధర్మాసనంలో ఆరుగురు న్యాయమూర్తులు సమర్థించగా, ముగ్గురు న్యాయమూర్తులు వ్యతిరేకించారు. కోర్టు తాజా నిర్ణయంతో నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికలలోపు న్యాయస్థానాల్లో ట్రంప్‌ను విచారించే అవకాశాలు ఉండవు. స్పెషల్‌ కౌన్సెల్‌ జాక్‌ స్మిత్‌ మోపిన అభియోగాల్లో మిగిలిన వాటిపై విచారణ కోసం ట్రయల్‌ కోర్టుకు ఈ కేసును న్యాయస్థానం తిప్పిపంపినప్పటికీ అవేవీ ఇప్పట్లో విచారణకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. బాలెట్‌ పత్రాల్లో ట్రంప్‌ పేరు చేర్చవద్దన్న కింది కోర్టు తీర్పును నిలిపివేసిన తర్వాత ట్రంప్‌నకు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానంలో వెలువడిన మరో తీర్పు ఇది. ‘అమెరికా రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారాల విభజనను అనుసరించి ప్రస్తుత అధ్యక్షునికి ఉన్నట్లే మాజీ అధ్యక్షునికి నేరాభియోగ విచారణ నుంచి సంపూర్ణ మినహాయింపు ఉంటుంద’ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ తీర్పులో పేర్కొన్నారు. అధ్యక్షుని అధికారిక చర్యలు అన్నిటికీ విచారణ నుంచి రక్షణ ఉంటుందని, అనధికారిక చర్యలకు మాత్రం మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. ఈ తీర్పును జస్టిస్‌ సోనియా సొటొమేయర్‌ వ్యతిరేకిస్తూ...ఏ ఒక్క వ్యక్తీ చట్టానికి అతీతులు కారని పేర్కొన్నారు. మాజీ అధ్యక్షునికి నేరాభియోగాల విచారణ నుంచి మినహాయింపునివ్వడం రాజ్యాంగ సూత్రాలను, ప్రభుత్వ వ్యవస్థను అపహాస్యం చేయడమేనని ధ్వజమెత్తారు. జస్టిస్‌ సోనియా సొటొమేయర్, మరో ఇద్దరు మెజారిటీ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుతో విభేదించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్‌ స్పందిస్తూ...‘మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఇది భారీ విజయం. అమెరికా పౌరుడిగా గర్విస్తున్నా’నని సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని