ప్రమాదవశాత్తూ గాల్లోకి చైనా రాకెట్‌

పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో చైనాకు చెందిన ఒక శక్తిమంతమైన రాకెట్‌ ప్రమాదవశాత్తు గాల్లోకి దూసుకెళ్లింది.

Published : 02 Jul 2024 04:48 IST

పర్వతాలపై పడటంతో తప్పిన ముప్పు 

బీజింగ్‌: పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో చైనాకు చెందిన ఒక శక్తిమంతమైన రాకెట్‌ ప్రమాదవశాత్తు గాల్లోకి దూసుకెళ్లింది. అది ఒక పర్వత ప్రాంతంపై పడింది. పరీక్షలకు ముందే అక్కడి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడంతో పెను ముప్పు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. 

తియాన్‌లాంగ్‌-3 అనే ఈ రాకెట్‌ను చైనాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ ‘స్పేస్‌ పయనీర్‌’ రూపొందించింది. అందులో 9 ఇంజిన్లు ఉంటాయి. చైనాలోనే అత్యంత శక్తిమంతమైన రాకెట్‌గా అది గుర్తింపు పొందింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం హెనాన్‌ ప్రావిన్స్‌లోని గాంగ్యీ వద్ద దీనికి స్థిర ప్రజ్వలన పరీక్ష నిర్వహించారు. ఇందులో రాకెట్‌ బాడీని పరీక్ష వేదికకు దృఢంగా బిగించి.. దాని ప్రజ్వలన సామర్థ్యాన్ని పరీక్షించారు. నేల మీదే స్థిరంగా ఉంటూ మండాల్సిన ఈ రాకెట్‌.. అకస్మాత్తుగా కట్టలుతెంచుకొని గాల్లోకి దూసుకెళ్లింది. రాకెట్‌కు పరీక్ష వేదికకు మధ్య ఉండే ఒక కనెక్షన్‌ పటిష్ఠంగా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని స్పేస్‌ పయనీర్‌ సంస్థ పేర్కొంది. పైకి దూసుకుపోయిన వెంటనే రాకెట్‌లోని ఆన్‌బోర్డ్‌ కంప్యూటర్‌ ఆటోమేటిక్‌గా నిలిచిపోయింది. దీంతో అది పరీక్ష వేదికకు 1.5 కిలోమీటర్ల దూరంలోని గాంగ్యీ పర్వతాలపై కూలిపోయింది. అందులోని కిరోసిన్, ద్రవ ఆక్సిజన్‌ ఒక్కసారిగా ప్రజ్వరిల్లి.. భారీ విస్ఫోటం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా చెలరేగిన మంటల్ని అగ్నిమాపక బృందాలు ఆర్పేశాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని