మనుగడ వ్యూహాలకు కేంద్రస్థానం ఇదే..!

మనుగడ కోసం సందర్భోచితంగా వివిధ వ్యూహాలను అనుసరించాల్సి ఉంటుంది. మెదడులోని హైపోథాలమస్‌ అనే భాగం ఈ అంశంలో కీలకమని అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధన గుర్తించింది.

Published : 02 Jul 2024 04:46 IST

దిల్లీ: మనుగడ కోసం సందర్భోచితంగా వివిధ వ్యూహాలను అనుసరించాల్సి ఉంటుంది. మెదడులోని హైపోథాలమస్‌ అనే భాగం ఈ అంశంలో కీలకమని అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధన గుర్తించింది. హైపోథాలమస్‌ అనేది బాదం గింజ పరిమాణంలో మెదడు అంతర్భాగాల్లో ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను కాపాడటంలోనూ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందువల్ల దీన్ని శరీర థర్మోస్టాట్‌ అని కూడా పిలుస్తారు. ఆకలి, దప్పిక, అలసట, నిద్రను నియంత్రించడంలోనూ దీనికి ప్రమేయం ఉంది. తాజాగా కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని బయటపెట్టారు. పరస్పరం భిన్నమైన పలు చర్యలకు మళ్లడంలోనూ హైపోథాలమస్‌ కీలకమని తేల్చారు. ఒక జంతువును వేటాడటం, ప్రమాదకరమైన జంతువు నుంచి తప్పించుకోవడం లాంటివన్నమాట. ఇవి పరస్పరం భిన్నమైన చర్యలు. మన మనుగడలో హైపోథాలమస్‌ పోషిస్తున్న పాత్రపై అవగాహనను ఈ పరిశోధన మరింత పెంచుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. పరిశోధనలో భాగంగా.. మనుగడకు సంబంధించిన ఒక వర్చువల్‌ గేమ్‌ను 21 మంది పరీక్షార్థులతో ఆడించారు. ఆ సమయంలో వారి మెదళ్లను ఫంక్షనల్‌ మ్యాగ్నెటిక్‌ రెజోనెన్స్‌ ఇమేజింగ్‌ (ఎఫ్‌ఎంఆర్‌ఐ)తో స్కాన్‌ చేశారు. ఈ స్కాన్లను ఒక కృత్రిమ మేధ (ఏఐ) నమూనాతో విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. సందర్భోచితంగా మనుగడ వ్యూహాలను అనుసరించడంలో హైపోథాలమస్‌ పాత్రను గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని