హిందూ విశ్వాసం నుంచి ప్రేరణ పొందా

బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి శనివారం లండన్‌లోని నీస్‌డెన్‌లో గల బీఏపీఎస్‌ శ్రీ స్వామినారాయణ్‌ ఆలయాన్ని సందర్శించారు.

Updated : 01 Jul 2024 06:28 IST

రిషి సునాక్‌ వ్యాఖ్య  
స్వామినారాయణ్‌ ఆలయ సందర్శన

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి శనివారం లండన్‌లోని నీస్‌డెన్‌లో గల బీఏపీఎస్‌ శ్రీ స్వామినారాయణ్‌ ఆలయాన్ని సందర్శించారు. ఈ నెల 4న దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దైవ దర్శనం చేసుకున్నారు. వారికి ఆలయ పూజారులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం అక్కడ ఉన్న సేవా కార్యకర్తలు, హిందూ నాయకులతో సునాక్‌ మాట్లాడారు. భారత్‌ టీ20 ప్రపంచకప్‌ సాధించడాన్ని ప్రస్తావించారు. ‘‘నేను హిందువును. ఇక్కడున్న మీరంటే నాకెంతో ఇష్టం. నేను నా విశ్వాసం నుంచి ప్రేరణ, ఓదార్పు పొందుతాను. భగవద్గీతపై పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణం చేయడం నాకు గర్వకారణం. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలని మన విశ్వాసం బోధిస్తుంది. మన విధులను ఆత్మవిశ్వాసంతో నిర్వహించినప్పుడు ఫలితాన్ని చూసి చింతించకూడదు. ప్రజాసేవకు సంబంధించి నా దృక్పథంలో నా ధర్మమే నాకు మార్గదర్శకత్వం. ఏ భర్తకు లభించని విధంగా నా భార్య నాకు గొప్ప మద్దతుదారే కాక..ప్రజా సేవ పట్ల నిబద్ధత కలిగిన మహిళ’’ అని సునాక్‌ పేర్కొన్నారు. సునాక్‌ తన ఆలయ సందర్శన ద్వారా బ్రిటన్‌లోని హిందువుల ఓట్లను ఆకర్షిస్తున్నారు.

‘హిందూ’ ఓట్లపై పార్టీల కన్ను 

బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి వారంతం కావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు విస్తృత ప్రచారంలో మునిగిపోయారు. ఈ క్రమంలో అక్కడ హిందూ ఓటర్లపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా ప్రధానమంత్రి, కన్జర్వేటివ్‌ పార్టీ నేత రిషి సునాక్, లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌లు అక్కడ హిందూ దేవాలయాలను సందర్శించి, తమ విధానాలతో ఆ వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌ కూడా కింగ్స్‌బరీలో ఉన్న మరో స్వామినారాయణ్‌ ఆలయాన్ని సందర్శించారు. భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూనే హిందూ ఆలయాల రక్షణ, ఈ వర్గంపై దాడులను దీటుగా ఎదుర్కొనే చర్యలు తమ మేనిఫెస్టోలో ఉన్నాయన్నారు. 2021 గణాంకాల ప్రకారం బ్రిటన్‌లో దాదాపు 10లక్షల మంది హిందువులు ఉన్నట్లు అంచనా. వీరిలో ఓటర్ల సంఖ్య కూడా భారీగానే ఉండనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు