సూడాన్‌లో సైన్యంతో సాయుధ ఘర్షణ

సైన్యానికి, ప్రమాదకరమైన సాయుధ బలగాలకు మధ్య మొదలైన ఘర్షణతో ఆఫ్రికాలోని సూడాన్‌లో మరోసారి ఉద్రిక్తత చెలరేగింది.

Published : 01 Jul 2024 02:53 IST

కైరో: సైన్యానికి, ప్రమాదకరమైన సాయుధ బలగాలకు మధ్య మొదలైన ఘర్షణతో ఆఫ్రికాలోని సూడాన్‌లో మరోసారి ఉద్రిక్తత చెలరేగింది. 14 నెలలుగా కొనసాగుతున్న పోరులో ఇదో కొత్త మలుపు. సెన్నార్‌ ప్రావిన్సులో కొద్దిరోజుల క్రితం దాడులు ప్రారంభమయ్యాయి. దానికి కొనసాగింపుగా మరో గ్రామంలో ఘర్షణలు జరిగి చివరకు బలగాలు ప్రావిన్సు రాజధాని సింగాకు చేరుకున్నాయి. ట్రక్కులకు ఆటోమేటిక్‌ తుపాకీలను అమర్చుకున్న సాయుధులు ఆ నగరంలో ఇళ్లు, దుకాణాలు, మార్కెట్లను దోచుకున్నారు. ప్రధాన ఆసుపత్రిని తమ ఆధీనంలో తీసుకున్నారు. సైన్యానికి చెందిన 17వ పదాతిదళ ప్రధాన కార్యాలయాన్నీ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఉభయవర్గాల పోరులో గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 14 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఐరాస అంచనా. ఇది ఇంకా ఎక్కువే ఉంటుందని హక్కుల సంఘాలు చెబుతున్నాయి. ఘర్షణల వల్ల కోటి మందికి పైగా ప్రజలు ఇళ్లను వీడి వెళ్లిపోవాల్సి వచ్చిందని, రాబోయే రోజుల్లో కొన్ని లక్షలమంది కరవుబారిన పడతారని అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని