సుస్థిరాభివృద్ధి ఉప లక్ష్యాల సాధనలో ప్రపంచం వెనుకంజ

ప్రపంచంలో 700 కోట్లమంది ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన 169 ఉప లక్ష్యాలలో కేవలం 17 శాతాన్ని మాత్రమే 2030 గడువుకల్లా సాధించగలుగుతామని ఐక్యరాజ్యసమితి వార్షిక నివేదికలో పేర్కొంది.

Published : 30 Jun 2024 05:25 IST

ఆందోళన వ్యక్తంచేసిన ఐక్యరాజ్యసమితి

ఐక్యరాజ్యసమితి: ప్రపంచంలో 700 కోట్లమంది ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన 169 ఉప లక్ష్యాలలో కేవలం 17 శాతాన్ని మాత్రమే 2030 గడువుకల్లా సాధించగలుగుతామని ఐక్యరాజ్యసమితి వార్షిక నివేదికలో పేర్కొంది. దీన్ని విడుదల చేసిన సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌... ప్రపంచాన్ని పరీక్షలో తప్పిన విద్యార్థితో పోల్చారు. 2030కల్లా ప్రపంచంలో పేదరికాన్ని పారదోలి, లింగ సమానత్వం సాధించడానికి ఉద్దేశించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై 2015లో ప్రపంచ నాయకులు అంగీకారానికి వచ్చారు. వీటికి అనుబంధంగా 169 ఉప లక్ష్యాలున్నాయి. కొవిడ్‌ విరుచుకుపడిన 2019తో పోలిస్తే 2022లో అదనంగా 2.3 కోట్ల మంది దుర్భర దారిద్య్రంలో జారిపోయారనీ, 10 కోట్ల మంది ఆకలిదప్పులతో అలమటిస్తున్నారని సమితి నివేదిక తెలిపింది. అపార విజ్ఞానసంపదలు, అత్యధునాతన టెక్నాలజీలు పోగుపడిన నేటి ప్రపంచంలో ఇన్ని కోట్లమంది కనీసావసరాలు తీరకపోవడం క్షమించరాని విషయమని గుటెరెస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘2022లో ప్రపంచంలో 60 శాతం దేశాల్లో ఆహార ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రపంచంలో 58 శాతం విద్యార్థులు మాత్రమే ప్రాథమిక పాఠశాల విద్య పూర్తయ్యేసరికి చదవడం, రాయడం నేర్చుకోగలుగుతున్నారు. లింగ సమానత్వంలోనూ ప్రపంచం వెనుకబడింది. ప్రతి అయిదుగురు బాలికల్లో ఒకరు ఇప్పటికీ 18 ఏళ్లకు ముందే పెళ్లి చేసుకోవలసి వస్తోంది. మేనేజ్‌మెంట్‌ పదవుల్లో పురుషులతో సమాన స్థాయికి రావడానికి స్త్రీలకు ఇంకా 176 సంవత్సరాలు పడుతుంది’’ అని సమితి నివేదిక తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని