ఐక్యూ తక్కువైతే పక్షవాతం!

బాల్యంలోనూ, కౌమారంలోనూ ఏకాగ్రత, అభ్యసన శక్తి తక్కువగా ఉన్నవారు యాభై ఏళ్ల వయసు రావడానికి ముందే పక్షవాతం బారిన పడే ప్రమాదం ఎక్కువని ఇజ్రాయెల్‌లోని హీబ్రూ విశ్వవిద్యాలయ పరిశోధన హెచ్చరిస్తోంది.

Published : 30 Jun 2024 05:10 IST

దిల్లీ: బాల్యంలోనూ, కౌమారంలోనూ ఏకాగ్రత, అభ్యసన శక్తి తక్కువగా ఉన్నవారు యాభై ఏళ్ల వయసు రావడానికి ముందే పక్షవాతం బారిన పడే ప్రమాదం ఎక్కువని ఇజ్రాయెల్‌లోని హీబ్రూ విశ్వవిద్యాలయ పరిశోధన హెచ్చరిస్తోంది. చిన్నవయసులో మానసిక శక్తి తక్కువగా ఉంటే పెద్దయ్యాక గుండె, రక్తనాళ సమస్యలు, జీవక్రియ సమస్యలూ వస్తాయని పరిశోధకులు సూచించారు. ఇజ్రాయెల్‌లో సైనిక సర్వీసులో చేరబోతున్న 16 నుంచి 20 ఏళ్ల వయసులోని 17.4 లక్షల మందిని పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చారు. 1987-2012 మధ్యకాలంలో వారి సైన్య రికార్డులనూ, జాతీయ పక్షవాత సమాచార నిధిని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. అల్ప.మధ్యస్థాయి ఏకాగ్రత, అభ్యసన శక్తులను కనబరచినవారి ఐక్యూ 118 లోపే ఉంది. వీరికి 50 ఏళ్లకు ముందే పక్షవాతం వచ్చే ప్రమాదం రెండున్నర రెట్లు ఎక్కువని తేలింది. ఐక్యూ స్కోరు 118కన్నా ఎక్కువుంటే పక్షవాత ముప్పు చాలా తక్కువ. పరిశోధకులు రూపొందించిన 1-9 స్కేలుపై 1-3 స్కోరు వచ్చినవారి ఐక్యూ అతి తక్కువగా, అంటే 89కన్నా లోపే ఉంటుంది. 4-7 స్కోరు వచ్చినవారి ఐక్యూ మధ్యస్థంగా (90-118) ఉంటుంది. 8-9 స్కోరు వచ్చినవారి ఐక్యూ 118కన్నా ఎక్కువే. ఈ స్కేలుపై ఒక్కో పాయింటు తగ్గినకొద్దీ పక్షవాత ప్రమాదం 33 రెట్లు ఎక్కువ అవుతూ ఉంటుంది. తక్కువ ఐక్యూ స్కోరు ఉన్నవారికి ముందునుంచే ఆరోగ్య, సామాజికపరంగా సహాయసహకారాలు అందించి పక్షవాత ప్రమాదాన్ని తగ్గించాలని పరిశోధకులు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని