అణుసామర్థ్య స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణులను తయారుచేస్తాం

అణు సామర్థ్యం గల స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణుల తయారీని పునఃప్రారంభిస్తామని శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. అమెరికాను హెచ్చరించారు.

Updated : 29 Jun 2024 06:05 IST

అమెరికాకు పుతిన్‌ హెచ్చరిక

మాస్కో: అణు సామర్థ్యం గల స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణుల తయారీని పునఃప్రారంభిస్తామని శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. అమెరికాను హెచ్చరించారు. ఈ క్షిపణులను ఆసియా, ఐరోపాలో అగ్రరాజ్యం మోహరించిందన్న వార్తల నేపథ్యంలో పుతిన్‌ ఈ వ్యాఖ్య చేశారు. స్వల్ప, మధ్యశ్రేణి అణు క్షిపణులను ధ్వంసం చేయాలని 1987లో అమెరికా, రష్యా మధ్య ఇంటర్‌మీడియట్‌ రేంజ్‌ న్యూక్లియర్‌ ఫోర్సెస్‌ ఒప్పందం (ఐఎన్‌ఎఫ్‌) కుదిరింది. అయితే మాస్కో దీన్ని ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ 2019లో ఆ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. ‘‘ఈ క్షిపణి వ్యవస్థలను అమెరికా తయారు చేస్తోందని ఇప్పుడే మాకు తెలిసింది. ఒప్పందం నుంచి అమెరికా తొలగినా.. మేం మాత్రం వాటిని ఉత్పత్తి చేయలేదు. ఇప్పటికే డెన్మార్క్‌లో విన్యాసాల కోసం అని చెప్పి వాటిని ఐరోపాకు అమెరికా తీసుకొచ్చింది. ఇవి ఫిలిప్పీన్స్‌లోనూ ఉన్నాయని ఇటీవల ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే మేం కూడా ఈ ఆయుధ వ్యవస్థను తయారు చేసుకోవాలి’’ అని పుతిన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని