అమెరికా హెల్త్‌ కేర్‌ కుంభకోణంలో హైదరాబాద్‌ వైద్యుడు

అమెరికాలో చోటుచేసుకున్న భారీ ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌ కేర్‌) కుంభకోణానికి సంబంధించి ఓ భారతీయుడు, ఇద్దరు భారత సంతతి వ్యక్తులు సహా 193 మందిపై అభియోగాలు నమోదయ్యాయి.

Published : 29 Jun 2024 05:18 IST

మొత్తం 193 మందిపై అభియోగాల నమోదు

వాషింగ్టన్‌: అమెరికాలో చోటుచేసుకున్న భారీ ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌ కేర్‌) కుంభకోణానికి సంబంధించి ఓ భారతీయుడు, ఇద్దరు భారత సంతతి వ్యక్తులు సహా 193 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. నిందితులు మోసపూరిత పథకాలతో మొత్తం రూ.22,924 కోట్ల (2.75 బిలియన్‌ డాలర్లు) మేర నష్టం చేకూర్చాలని భావించారని, వాస్తవానికి రూ.13,338 కోట్ల (1.6 బిలియన్‌ డాలర్లు) నష్టం సంభవించిందని న్యాయ విభాగం పేర్కొంది. అభియోగాలు నమోదైన 193 మందిలో అమెరికా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 76 మంది వైద్యులు, నర్సులు, ఇతర లైసెన్సు కలిగిన వైద్య నిపుణలు ఉన్నట్లు తెలిపింది. ఈ కేసులో ఇప్పటివరకు ప్రభుత్వం 23.1 కోట్ల డాలర్ల నగదు, విలాసవంతమైన వాహనాలు, బంగారం, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు న్యాయ విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్‌కు చెందిన విజిల్‌ రాహులన్‌ (52) ఆరోగ్య సంరక్షణ మోసానికి కుట్రపన్నారని, 8.2 కోట్ల డాలర్ల మెడికేర్‌ నిధులను పొందేందుకు సంబంధించిన మోసపూరిత పథకంలో భాగస్వాములయ్యారని అభియోగాలు నమోదయ్యాయి. ‘‘తప్పుడు క్లెయిమ్‌లు పొందడం, రీఎంబర్స్‌మెంట్‌ రానివాటికి కూడా బిల్లులు పెట్టి నిధులు పొందడం వంటి నేరాలకు రాహులన్‌ పాల్పడ్డారు’’ అని కేసులో పేర్కొన్నారు. దీంతోపాటు మరో 2.87 కోట్ల డాలర్లు మెడికేర్‌ ద్వారా మోసపూరిత చెల్లింపులకు కూడా ఆయన కారణమైనట్లు పేర్కొన్నారు. వన్‌ వరల్డ్‌ థెరపీ యజమాని జస్‌ప్రీత్‌ జగ్‌పాల్, రమా ప్రయాగలపైనా అభియోగాలు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని