సంక్షిప్త వార్తలు (4)

అమెరికాలో ఆసియన్ల జనాభా 2.06 కోట్లకు చేరుకుంది. 2023లో 5,85,000 మంది ఆసియన్లు పెరిగారు. వీరిలో వలస వచ్చిన వారే అధికం.

Updated : 28 Jun 2024 06:29 IST

అమెరికాలో 2.06 కోట్లకు చేరుకున్న ఆసియన్ల జనాభా

హ్యూస్టన్‌: అమెరికాలో ఆసియన్ల జనాభా 2.06 కోట్లకు చేరుకుంది. 2023లో 5,85,000 మంది ఆసియన్లు పెరిగారు. వీరిలో వలస వచ్చిన వారే అధికం. అమెరికా జన గణన సంస్థ గురువారం విడుదల చేసిన 2023 నాటి లెక్కల ప్రకారం.. టెక్సాస్‌లోనే ఆసియన్లు అధికంగా నివసించడానికి ఇష్టపడుతున్నారు. హ్యూస్టన్‌లో హిస్పానియన్లు, డాలస్‌లో ఆసియన్లు అధికంగా పెరిగారు. టెక్సాస్‌కు అదనంగా 2023లో 92,000 మంది ఆసియన్లు వచ్చి చేరారు. ప్రస్తుతం దేశంలో హిస్పానియేతర శ్వేత జాతీయులు 58శాతం ఉన్నారు. అమెరికాలో వారిదే అతి పెద్ద వర్గం. ఆ తర్వాతి స్థానంలో హిస్పానియన్లు ఉన్నారు. దేశంలో వారి జనాభా 6.52 కోట్లు. ఆఫ్రో అమెరికన్ల జనాభా 4.23 కోట్లుగా ఉంది.  


ఈజిప్టుకు చేరిన 21 మంది గాజా క్యాన్సర్‌ రోగులు

దుబాయ్‌: గాజాలో ఆసుపత్రులు ధ్వంసం కావడంతో చికిత్స దొరక్క ఇబ్బందిపడుతున్న 21 మంది క్యాన్సర్‌ రోగులు గురువారం ఈజిప్టు చేరుకున్నారు. మే నెలలో రఫా క్రాసింగ్‌ మూతపడిన తర్వాత ఈజిప్టులోకి గాజా రోగులు ప్రవేశించడం ఇదే తొలిసారి. వీరు ఈజిప్టు నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు వెళ్లి అక్కడ చికిత్స తీసుకోనున్నారు. 

ఎర్రసముద్రంలో గురువారం మరో వాణిజ్యనౌకపై యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. సిబ్బంది ఎవరైనా గాయపడ్డారా లేదా అన్న వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.


డాలస్‌ రెస్టారెంటులో ఇద్దరి కాల్చివేత

ఇర్వింగ్‌ (టెక్సాస్‌): డాలస్‌ శివారులోని ఓ రెస్టారెంటులో బుధవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఇవి వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని జరిపిన కాల్పులని, అనుమానితుణ్ని గుర్తించినా ఇంకా అరెస్టు చేయలేదని ఇర్వింగ్‌ పోలీసులు చెప్పారు. కాల్పులకు దారితీసిన కారణాలను ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. 


బొలీవియాలో సైనిక తిరుగుబాటు యత్నం విఫలం

లా పాజ్‌: బొలీవియాలో అధ్యక్షుడు లూయీస్‌ ఆర్సే ప్రభుత్వంపై జరిగిన సైనిక తిరుగుబాటు విఫలమైంది. ప్రధాన సైన్యాధికారి జనరల్‌ హువాన్‌ హోసే జునిగా నాయకత్వంలో సైనిక దళాలు దేశాధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లినా వెంటనే వెనుదిరిగాయి. రాజధాని లా పాజ్‌లో గురువారం తిరిగి ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. జనరల్‌ జునిగా దళాలు ఓ యుద్ధ ట్యాంకుతో అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లాయి. రాజధానిలోని ప్రధాన కూడలిని స్వాధీనం చేసుకున్నాయి. దానిని నిరసిస్తూ వీధుల్లోకి వచ్చిన ప్రజలపై బాష్పవాయు ప్రయోగం చేశాయి. మూడు గంటల సేపు కొనసాగిన ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చిపెట్టాయి. ప్రతిపక్షాలు కూడా జనరల్‌ జునిగా తిరుగుబాటును ఖండించడంతో ఆయన తన దుస్సాహసాన్ని విరమించారు. దేశాధ్యక్షుడు ఆర్సే ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించి కొత్త ప్రధాన సైన్యాధికారిని నియమించారు. జనరల్‌ జునిగాను అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని