అమెరికాలో వరదలకు కూలిన వంతెన

కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అమెరికాలో వరదలు తీవ్రమయ్యాయి. ప్రవాహ తీవ్రతకు ఓ రైలు వంతెన కూలగా, మరోచోట ఓ డ్యామ్‌ బద్దలై జనావాసాల్లోకి నీరు చేరింది.

Published : 26 Jun 2024 05:54 IST

ఇద్దరి మృతి

మిన్నెసోటా రాష్ట్రంలో వరదల కారణంగా తెగిపోయిన డ్యామ్‌

నార్త్‌ సియోక్స్‌ సిటీ(అమెరికా): కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అమెరికాలో వరదలు తీవ్రమయ్యాయి. ప్రవాహ తీవ్రతకు ఓ రైలు వంతెన కూలగా, మరోచోట ఓ డ్యామ్‌ బద్దలై జనావాసాల్లోకి నీరు చేరింది. ముఖ్యంగా అయోవా, సౌత్‌ డకోటా, మిన్నెసోటా, నెబ్రస్కా రాష్ట్రాల్లో దాదాపు 30 లక్షల మంది వరదలవల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయోవాలో ఓ వ్యక్తి వరదలో కొట్టుకుపోగా, సౌత్‌ డకోటాలో మరొకరు మరణించారు. గురువారం నుంచి శనివారం వరకూ కొన్ని చోట్ల 46 సెం.మీ. వర్షపాతం నమోదుకావడంతో చాలా ప్రాంతాల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. పైనుంచి వరద రావడంతో వర్షాలు లేని ప్రాంతాల్లోనూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకట్రెండు రోజుల్లో మరిన్ని వర్షాలు పడే సూచనలున్నాయని, ఈ వారం మధ్యనాటికి మిసౌరీ, మిసిసిపీ నదులు ఉద్ధృతిని అందుకుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సౌత్‌ డకోటాలోని బిగ్‌ సియోక్స్‌ నదిపై నిర్మించిన ఓ రైలు వంతెన ఆదివారం రాత్రి 11 గంటలకు కూలింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. మిన్నెసోటాలోని బ్లూఎర్త్‌ కౌంటీలో వరద తీవ్రతకు ది ర్యాపిడాన్‌ డ్యామ్‌ బద్దలైంది. దీంతో డ్యామ్‌ దిగువనున్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిడ్‌వెస్ట్‌ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఓవైపు వరదలు, మరోవైపు వేడి గాలులతో ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. సోమవారం అక్కడ కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు