యూదు ఆధ్యాత్మిక విద్యార్థులకూ నిర్బంధ సైనిక సర్వీసు: సుప్రీంకోర్టు

యూదు మత విద్యాసంస్థల్లో చదివే యువతకు కూడా సాధారణ ఇజ్రాయెలీ పౌరుల మాదిరిగానే సైన్యంలోకి తీసుకొని యుద్ధంలో నియోగించాలని ఇజ్రాయెల్‌ సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.

Published : 26 Jun 2024 05:43 IST

నెతన్యాహు సంకీర్ణ సర్కారుకు ముప్పు!

జెరూసలెం: యూదు మత విద్యాసంస్థల్లో చదివే యువతకు కూడా సాధారణ ఇజ్రాయెలీ పౌరుల మాదిరిగానే సైన్యంలోకి తీసుకొని యుద్ధంలో నియోగించాలని ఇజ్రాయెల్‌ సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. అసలే అరకొర మెజారిటీతో నెగ్గుకొస్తున్న బెంజమిన్‌ నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి ఈ తీర్పు దారి తీయవచ్చు. గాజాలో తొమ్మిది నెలలుగా హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్‌కు సైనికుల కొరత ఏర్పడిన సమయంలో ఈ తీర్పు విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ఇజ్రాయెల్‌ చట్టాల ప్రకారం నిర్ణీత వయసు యువతీ యువకులు తప్పనిసరిగా కొంతకాలం సైన్యంలో పనిచేయాల్సి ఉంటుంది. యూదు మత విద్యాసంస్థల్లో చదివే యువకులకు సైనిక సర్వీసు నుంచి మినహాయింపునిచ్చే చట్టమేదీ లేనందున వారు కూడా ఇతర పౌరుల మాదిరిగా నిర్బంధ సైనిక సర్వీసు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యూదు మత విద్యాసంస్థల విద్యార్థులకు చిరకాలంగా కొనసాగుతున్న మినహాయింపులను ఎత్తివేయడం నెతన్యాహు సంకీర్ణంలోని రెండు సనాతన పార్టీలకు ఆగ్రహం తెప్పించడం ఖాయం. ఈ పార్టీలు నిష్క్రమిస్తే ప్రభుత్వం కుప్పకూలి మళ్లీ ఎన్నికలు జరపాల్సి వస్తుంది. 120 సీట్లు గల ఇజ్రాయెల్‌ పార్లమెంటులో నెతన్యాహు సర్కారుకు కేవలం 64 సీట్లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని