గాల్లో తెరచుకున్న శిక్షణ విమానం పైకప్పు.. పైలట్‌కు భయానక అనుభవం

తేలికపాటి విమానంతో టేకాఫ్‌ అయిన నెదర్లాండ్స్‌కు చెందిన నరైన్‌ మెల్కుమ్జాన్‌ అనే మహిళా పైలట్‌కు అంతలోనే ఊహించని అనుభవం ఎదురైంది.

Published : 26 Jun 2024 05:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తేలికపాటి విమానంతో టేకాఫ్‌ అయిన నెదర్లాండ్స్‌కు చెందిన నరైన్‌ మెల్కుమ్జాన్‌ అనే మహిళా పైలట్‌కు అంతలోనే ఊహించని అనుభవం ఎదురైంది. గగనతలంలో విన్యాసం చేస్తుండగా.. అకస్మాత్తుగా దాని పైకప్పు తెరచుకుంది. అటువంటి భయానక పరిస్థితుల్లోనూ ఆమె అలాగే కొద్దిసేపు ప్రయాణించి.. చివరకు సురక్షితంగా ల్యాండ్‌ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేస్తూ.. ప్రయాణంలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలంటూ పైలట్లకు సూచనలు చేశారు. ‘‘విమానంతో విన్యాసాల శిక్షణలో భాగంగా అది నా రెండో ప్రయాణం. నేను నడుపుతోన్న ‘ఎక్స్‌ట్రా 330ఎల్‌ఎక్స్‌’ గాల్లో ఉండగానే దాని పైకప్పు తెరచుకుంది. టేకాఫ్‌కు ముందు సరిగ్గా తనిఖీలు చేసి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకోకుండానే శిక్షణకు వెళ్లడం కూడా నేను చేసిన మరో తప్పు. ఆ సమయంలో కళ్లద్దాలు కూడా లేకపోవడంతో నా పరిస్థితి మరింత దిగజారింది. ఒకవైపు విమానం భారీ శబ్దం.. మరోవైపు సరిగ్గా చూడలేని, శ్వాస తీసుకోలేని దుస్థితి. ఆ సమయంలోనూ దాన్ని నడిపించడం అత్యంత సవాల్‌గా మారింది. కంటి చూపు విషయంలో పూర్తిగా కోలుకునేందుకు దాదాపు 28 గంటలు పట్టింది. అవి నా జీవితంలో ఎంతో బాధాకరమైన క్షణాలు’’ అని రెండేళ్ల క్రితం నాటి తన అనుభవాన్ని కళ్లకు కట్టారు. ఇదంతా ఆలస్యంగా వెల్లడించానని, అయితే.. పైలట్లకు తన కథ ఒక హెచ్చరికగా ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని